Friday 4 January, 2008

తెరిసిన మూసిన కవిత

రెండచుల్ని పట్టుకొని
అచ్చాదనలేని దేహంపై
వస్ర్తాన్ని కప్పుకొన్నట్టే

చీరలుగా, చుడీదార్లుగా
షర్టులుగా, కోటులుగా మారుతుంటే
అద్దం భళ్ళున బద్దలయినట్టే
కవిత చదవడమంటే

పోటెక్కిన వరద వుదృతిలో
ఈదులాడుతున్నట్టే
వూతం దొరికితే, తీరం కనబడితే
వేసే బారల బారల బిగిసిన వూపిరి తెప్పరిల్లినట్లే
కవిత చదవడమంటే

వర్తమానాన్ని సర్రున చింపి
జ్ఞాపకాల అంచులగుండా
స్మృతుల బావిలో బొక్కెనవేసి
బాల్యాన్ని చేదుకున్నట్టే
కవిత చదవడమంటే

చితుకులతో వుడికిన మెతుకు
కారాన్ని పులుముకొని
పంటిగాట్లకు నలుగుతూ
నకనకలాడే ఆకలి పేగులోకి
సర్రున జారుతున్నట్టే
కవిత చదవడమంటే

పరువాల పరదాలుతీసిన పండువెన్నెల్లో
పరిమళాల సుగంధాలతో
మరిమరి మురిపించే చెలితో
సరసాల సరాగాలు ఆలపించినట్టే
కవిత చదవడమంటే

చిక్కులవిచ్చుల మెలికల్లో
అరవిచ్చిన మొగ్గలఆలోచనకు
పరిష్కార పల్లవి దొరికి
మెట్టుమెట్టుగా సౌధాలపైకి ఎగబాకుతున్నట్టే
కవిత చదవడమంటే

శబ్దమై నిశబ్దమై
తరంగాలలో అటునిటు తేలియాడి
తీరాలకు చేర్చబడి సేదదీరి
అనంతసూర్య స్నానమాడుతున్నట్టే
కవిత చదవడమంటే
చిరుగుజేబుల దారుల్లో
పరుగుల వత్తిడి చక్రాలలో నలిగే
రక్తంస్రవించని గుండెగాయాలకు
లేపనం పూస్తున్నట్టే
కవిత చదవడమంటే


చదివి చదివి
నలిగి నలిగి
నడచి నడచి
పరుగెత్తి పరుగెత్తి
రాలిపడిన విత్తనంగా
ఆలోచనలో అంకురించడమే
తెరిచిన కవితను మూయడమంటే


సాహిత్య ప్రస్థానం (త్రైమాస పత్రిక) జనవరి-మార్చి 2005



1 comment:

అనిర్విన్ said...

అవునండీ, షర్టులు, కోటులు స్త్రీలు కూడా ధరిస్తున్నారు కదా.
మీరు మరిన్ని మంచి కవితలు రాయాలని ఆకాంక్షిస్తూ...