నిన్నర్థంచేసుకోవాలనే ప్రయత్నంలో
మనోనేత్ర మసకల్తో
కళ్ళలో నలుసుల్తో
నాకు నేను అర్థం కాక
నన్ను నేను అర్థంచేసుకోలేక
ఈ నా చిన్ని ప్రపంచంలో
సమస్యల సంబంధాలలోచిక్కి
సంబంధాల కొత్త బంధాల్ని కూర్చుకుంటూ
సౌకుమార్యమైన బంధాల నడుమ
ప్రేమ దయ కరుణ జనించే మృదుత్వాలు
రుచించని నాలుకలాంటి భావంతో
గుంపుల్లోకి పరుగెడుతుంటాను
లేని మృధుత్వాన్ని ఆపాదించుకుంటూ
తెలియని రుచులకోసం వెదకుతుంటాను
ఆ ప్రయత్నంలో
అప్రయత్నంగా
మంచుతెర పొరలమాటున
నా కళ్ళెదురుగా ఎదురయ్యే బింబం
తేరిచూస్తే
నా ప్రతిబింబమేమోనని సందేహం
సందేహాలనడుమ
తెరకప్పిన దేహంవెనుక
ఎంతవికారమైనదో నా రూపం
నాలోని వికౄత రూపాలు
గోముఖ వ్యాఘ్రంలా
ఘట సర్పంలా ప్రదర్శనమౌతుంటాయి
కుళ్ళిన మాంసపు ముద్దలా
కంపుకొడుతుంటాయి
వికృత రూపం భయానకమౌతుంది
తెరను చింపుకొని
పొరలుతెంపుకొని
నన్నునేను గుర్తించీదేపుడు ?
నా వికృతరూపాన్ని అర్థం చేసుకొనెదెప్పుడు ?
నిన్ను అర్థంచేసుకొనేదెప్పుడు ?
నన్ను నేను అర్థంచేసుకుంటే కదా!
నిన్ను అర్థంచేసుకొనేది
ఎప్పుడైనా ఎక్కడైనా
వెలుగురేఖలు ప్రసరించినప్పుడు
నా మసకల్ని విప్పుకుంటాను
ఎప్పుడైనా ఎక్కడైనా
ప్రవహించే నై ఎదురైనప్పుడు
నా దేహాన్ని కడుక్కుంటాను
నేస్తం! ప్రియా!
నీ ఆలింగనం కోసం నన్ను నేను సిద్ధంచేసుకుంటాను.