Tuesday, 21 August 2012

బంధంనుంచి అనుబంధానికి అక్షరమాలలు



ఒక్కసారిగా గుప్పుమన్న సుగంధం
రంజాన్ సన్ననిచంద్రుడిలా
అంతర్జాలాన్ని తోసుకుంటూ
సప్తసముద్రాలనుంచి నా గదిలోకి దిగింది

ఎలా పదిల పర్చుకోవాలో తెలియనితనం
దువాకై చేతులెత్తింది

నిజంగా ఉదయం తిన్న కీర్ కన్నా
నీ పలుకు తీయదనం
బహుశ నీకు తెలియకపోవచ్చు
అప్పుడే పిండిన జుంటుతేనె
అరచేతినుండి మోచేతికి కారుతున్నట్టు

జ్ఞాపకాల గోదారి వెన్నెల్లో
తోసుకుపొతున్న పడవేదో నాకోసం వచ్చినట్టు
ఎన్ని యుగాలనుంచో
వినాలనే నీ పలుకు

వెన్నముద్దను చూపి గోరుముద్దలు తినిపించిన అమ్మ
నన్ను నాన్న అని పిలిచి నాతో ఆడుకున్న మరో అమ్మ
అక్షరాలను గ్లాసుల్లోనింపి
గోదారి నీళ్ళలా తాగించిన మరో అమ్మ

బంధంనుంచి అనుబంధానికి అక్షరమాలలు


***************************************
 రాధిక రిమ్మలపూడి తో చాలాకాలానికి చాట్ చేసిన ఘడియ

Monday, 20 August 2012

మా రోడ్లు - పెంటోలు






దాటేందుకేగా జీబ్రా లైన్సు
ఎటునుంచి ఏదివస్తుందో జీవితంలోకి!



పాదచారులకు ప్రత్యేకమే
ఆచరించినప్పుడేగా అనువుగా కన్పించేది!

Sunday, 19 August 2012

అవీ... ఇవీ...కొన్ని ఫెంటోలు



ఒక చిరునవ్వు వెంట
నాల్గక్షరాలు ఒలికించి చూసావా! ఎప్పుడైనా!

***

నడినెత్తిన ఎండపొడలో
స్నేహ కౌగిలికై నగ్నపాదాల నడిచావా!

***

గుమ్మటాలలోని పావురాలు
గింజలేరుకుంటూ తీసే కూనిరాగం విన్నావా!

***

ఎదురుచూసి సొమ్మసిల్లిన
పూరేకులను ప్రేమారగా ముద్దాడావా!

***

తలుపు తెరిచిన గదిలో
పగులగొట్టిన సుగంధాన్ని ఆఘ్రాణించావా!

***

కొంగలబారు రెక్కల శబ్దం
వెనుకెనుకే పయనించాలని చూసావా!

***

ఒక్కసారి ఇటువస్తావా
పొరలువిప్పి బాల్యంలోకి దూకి ఆడుకుందాం

Thursday, 9 August 2012

అంబులెన్సు అనుభవం

  

రయ్... రయ్... రయ్... రయ్...
వోయ్... వోయ్... వోయ్... వోయ్...
తప్పుకో ....తప్పుకో ....తప్పుకో ....తప్పుకో ...అన్నట్టు ఒకటే రొద

పొంగి పరవళ్ళుతొక్కే గోదారిని ఈదుతున్నట్టు
ప్రవాహపు ట్రాఫిక్ రహదారుల్లో తోసుకుంటూ
గమ్యానికి అతివేగంగా రోగిని చేర్చాలని
ఓ డ్రైవర్ తాప్రత్రయం

ఇరుకు ఇరుకు నగర ట్రాఫిక్ మధ్య ఎవరికి వారు దారిస్తూ
ఎవరున్నారో
ఏమిజరిగిందో అనుకుంటూ
ఆత్రంగా తోంగిచూసే కళ్ళు
ఏమీ కనబడలేదనే నిరుత్సాహం
దారిన పోతున్న వాళ్ళకు
వారి వారి అనుభవాలను తవ్వితీస్తుంటాయి

* * *

ఎమి జరగనుందో
ఏమీ చెబుతారో ఒకటే ఉత్కంఠ

అంబులెన్స్ అంటే
ఎగిరిపోతున్న ఆయువును హస్తాల్లో పట్టుకొని
రిలే పరుగు పందెం కోసం పరుగెడుతున్నట్టే

ఏది సుఖాంతమో
ఏది దుఖాఃంతమో
ఎవ్వరికీ తెలియని ఓ వింత పరుగు


( నలతగా వుందని ఆసుపత్రికి వెళితే అంబులెసు ఇచ్చి వేరే ఆసుపత్రికి పంపారు..... ఆ అనుభవంనుండి)
*25-07-2012