Tuesday, 19 February 2013

జాన్ హైడ్ కనుమూరి ||ఒక సంబాషణ ||



*************************

చెప్పండి!
ఏమి రాస్తున్నారు ?

చెప్పడానికేమీ లేదు
నిద్ర రాని రాత్రిని కత్తిరిస్తున్నాను

పూల అక్షరాలుగానా?
సీతాకోక చిలుకలుగానా?

అదేంటో
అన్నీ చెత్తబుట్టలోనే పడుతున్నాయి

ఎందుకలా?

రాత్రిని
కత్తిరించడం సులువేమీ కాదు కదా!

అవును!

వాడు ఎలుకతో ఎలా తంటాలు పడ్డాడో తెలిస్తే
ఈ రాత్రి సంచారానికి పనికొచ్చేది కదా!

అందుకేగా
ఎలుకను మీచేతికిచ్చింది!

***

జ్ఞాపకాల పొరల్లో ఎక్కడ్నుంచో
సుహానీ రాత్ డల్ చుకీ నా జానే తుం కబ్ ఆవొగీ

Tuesday, 12 February 2013

నేను నాన్న

నీవు ఇలా ఉండటం
నాకెంత ఆఆసీర్వాదమో ఎలాచెప్పను?

నిన్ను
అనుకరించినదేమైనా ఉందా!
నీవులేని సమయంలో
నీ చొక్కవేసుకుని
అచ్చం నీలా నడవడమేనా!

నీ నుంచి నేర్చుక్కన్నదేమైనా ఉందా!
అరమోడ్పుకన్నులతో గాలిలో చేయూపుతూ
కీట్సునో, షేక్సిపియర్‌నో
వివరిస్తుంటే
నా కన్రెప్పలపై నిద్రవాలిందనుకున్నా
ఇప్పుడనిపిస్తుంది
నిదురోయిన ఇంగ్లీషు వెన్నెల్లోకి
నన్ను నడిపించావని!

లోకం ప్రవాహనికి కొట్టుకుపోతుందని తెలిసి
ఎదురీదడం ఎలానో
ఎంత వొడుపుగా నేర్పావో!

రాష్ట్రమంతా
సమ్మెల సమ్మెటపోట్ల మధ్య ఊగుతుంటే
నా పుట్టినరోజుకు కాన్కగా
బైబిలును ఇవ్వడాన్కి
పొంగుతున్న కాల్వలను దాటి
నడిచొచ్చిన ఆ జ్ఞాపకాన్ని భద్రంగా దాచుకున్నా
బైబిలును ఎక్కడో పారేసుకున్నా
దగ్గరుండి మననంచేయించిన వాక్యాలు
నన్ను నిరంతరం నడిపిస్తూంటే
ఎలా పోగొట్తుకోగలను?

నమ్మినదాన్ని నిలుపుకోవడంకోసం
ఎన్ని అవమానలను
ఎంత సంఘర్షణననుభవించావో
ఏనాడూ మాఎదుట ప్రదశించలేదు

తరచూ అయ్యే బద్లీలలో
ఎన్నిసార్లు నలిగినా
ఇమడటంనేర్పావు

ఆస్తులేమి ఇవ్వకుంటే
ఏమాశీర్వాదమని లోకులన్నట్టే
అందరూ అనొచ్చు
నీవు ధరించిన అక్షరంవెనుక
మమ్మల్ని నిలబెట్టే ధీరత్వం
ఎలా కనబడుతుంది ఎవ్వరికైనా!

నూతన దయాకిరీటం అని
ఎప్పుడు చదివినా అసంపూర్ణగానే అర్థమయ్యేది
ఉద్యోగంచేసిన సంవత్సరాలకంటె
పెన్షన్ తీసుకున్న వసంతాలే ఎక్కువైనప్పుడు
దయా కిరీటాన్ని కనులారా చూడగల్గుతున్నా!
---
91వ వసంతంలో అడుగిడిన నాన్నకు

Sunday, 10 February 2013

పొరపాటే!





వెన్నెలదారిలో నడవడం
ఆహ్లాదమనుకుంటే పొరపాటే

సాహసాల సంచిని భుజాన వేసుకొని
రహదార్లు, విద్యుత్తుదీపాలులేని
గుబురు అలుముకున్న చెట్లలోంచి
మెలికలు తిరిగిన కాలిబాటను
ఒంటరిగా నడవడమే

బాల్యంలో విన్న దెయ్యంకథలు
వెనుకనుంచి విసిరే గాలిలోంచి
చెవిలో గుసగుసలాడొచ్చు
దారితప్పిన గువ్వపిట్ట
గుబులు గుబులుగా పాడేరాగం
వెన్నంటే రావొచ్చు

తప్పిపోయిన కుమారుడు
దూరాన నెగడై ఎందరికో వెచ్చదనానిస్తూ
పిలుస్తున్నట్టే అన్పించొచ్చు
మిణుగురులు పంపే ప్రేమసంకేతాలు
కన్రెప్పలను గుచ్చి గుచ్చి
ఆదమరచిన చెలిజ్ఞాపకాలు
మువ్వల సవ్వడై ముందు నడవనూవచ్చు

పేగుచివర రేగిన ఆకలిమంట
విద్యుల్లతలా ఆవరించి
దేహాన్ని వణించనూవచ్చు
వెన్నెలను ప్రేమించేది
నేనొక్కణ్ణే అనుకుంటే పొరపాటే

విరహపు రెక్కలను తెరచి
పరిష్వంగం కోసం పరితపించి
నాగరాజులు నాట్యమాడతాయి

రహస్య సంకేతాలను
చేరవేసే నక్కలు ఊళవేస్తాయి

ఇంద్రలోకపు వయ్యారాలను
తలదన్నే కలువభామలు
చెరువు వేదికపై
చంద్రుణ్ణి తేవాలనిచూస్తుంటాయి

ఎవ్వరూ రారక్కడికి
నా వూహలు తప్ప
అల్లుకున్న అక్షరాలు
అప్పుడప్పుడూ పలకరించిపోతుంటాయి

అడుగులను కొలతలుచేసి
ఎన్నిసార్లు ఈ దారిని కొలిచే ప్రయత్నంచేసానో
చీకటిపొరల మధ్యొకసారి
ఆత్రాల అంగలమధ్య ఇంకోసారి
తప్పించుకుంటూనే వుంది

వెన్నల తడిపిన
తెల్లటి బాటవెంట మోసుకుపోతున్నవన్నీ
బుజాన బరువెక్కి
గుండెల్లోకి చేరుతాయి

ఏనాడైతే కాంక్రీటు అడవిలో
బ్రతుకుతెరువు వెదక్కున్నానో
అప్పుడే వెన్నెలను
నియోన్‌లైట్ల కాంతికి కుదువపెట్టడమైయ్యింది
ఇక
వెన్నెలదారిలో నడవడం
ఆహ్లాదమనుకుంటే పొరపాటే
* * *
25-జనవరి-2013 వాకిలి పత్రిక  

Thursday, 7 February 2013

డా. కె. యెస్. రమణగారి స్మృతిలో




నేను ఎప్పుడూ నీవెంట
నీవు నావెంట పరగెత్తము కదా!

పలకరింపులు లేని మౌన సమయంలో
నీవెక్కడో వున్నావని
గుర్తొచ్చిన క్షణాలతో
గుర్తురాని క్షణాలతో
బుర్ర గోకుక్కుంటూ వుంటాను

జ్ఞానాన్నుంచో, సంస్కారంన్నుంచో 
ఏరుకున్న విత్తనాలను
అనువు కుదురినచోటుల్లో నాటుకుంటూ పోయావు
మొలకలుగానూ, మొక్కలుగానూ
చెట్లగానూ విస్తరించక మానవు కదా!

తీరా నీవెక్కడున్నావో తెల్సిపోయింది
కాలం కాటేసింది
ఎన్నటికీ కలవలేని దూరాన్ని
మన మధ్య నిలిపింది
ఇక జ్ఞాపకాలను నెమరువేసుకోవడమే.

జ్ఞాపకమైన ఒక కలయిక
అనుబంధాన్ని ముడివేస్తే
అక్షరాలు రాసులయ్యాయి
-----
అక్షర గురువులు డా. కె. యెస్. రమణగారి స్మృతిలో