Wednesday, 20 March 2013

కష్టమై పోతుంది



ప్రతిరోజూ
క్రమం తప్పకుండా
సమయానికి మాత్రలు మింగడం
సులువైపోయింది

నచ్చిన నాల్గు అక్షరాల్ని
కాపీ పేస్టుచేసి
ఎక్కడో ఒకచోట అతికించుకోవడం
సులువైపోయింది

మింగినవి
అతికించుకున్నవి
జీర్ణించుకోవడమే
కష్టమై పోతుంది
దేహానికి, జీవితానికి.

20.3.2013 06:40 hours ISD

సుహానీ రాత్ డల్ చుకీ


చెప్పండి!
ఏమి రాస్తున్నారు ?

చెప్పడానికేమీ లేదు
నిద్ర రాని రాత్రిని కత్తిరిస్తున్నాను

పూల అక్షరాలుగానా?
సీతాకోక చిలుకలుగానా?

అదేంటో
అన్నీ చెత్తబుట్టలోనే పడుతున్నాయి

ఎందుకలా?

రాత్రిని
కత్తిరించడం సులువేమీ కాదు కదా!

అవును!

వాడు ఎలుకతో ఎలా తంటాలు పడ్డాడో తెలిస్తే
ఈ రాత్రి సంచారానికి పనికొచ్చేది కదా!

అందుకేగా
ఎలుకను మీచేతికిచ్చింది!

***

జ్ఞాపకాల పొరల్లో ఎక్కడ్నుంచో
సుహానీ రాత్ డల్ చుకీ నా జానే తుం కబ్ ఆవొగీ

 ------------------------------
with thanks to Swatee Sripada

Tuesday, 19 March 2013

నిశ్శబ్దం ఆవరించింది




బహుశ
కోర్కెలు రేపిన మంత్రజాలంలో పడి
ఏటు పరుగులు తీసానో!

నా చుట్టూ తిరిగే
దైనందికజీవితం చుట్టేస్తే
అక్కడే తిరుగుతూ వుండిపోయానేమో!

పలరింపులన్ని
స్వార్దచింతన జాలంలో చిక్కితే
తడియారిన పెదవుల్తో
ఇక్కడే నిలచుండిపోయానేమో!

అలోచన మరో ఆలోచనను చీలుస్తుంటే
విడివడిపోతున్న
కొంగ్రొత్త ఆలోచనయ్యానేమో!

ఒకొక్క ఋతువులో
ఒక్కో గాలివీచినట్టు
ఏ గాలికి కొట్టుకు పోయానో!

ఎందుకో ఎమో
ఇప్పుడిక్కడ నిశ్శబ్దం ఆవరించింది

18.03.2013 23:16 hours ISD

Sunday, 10 March 2013

పరుగులు పరుగులు




ప్రయత్నమో
అప్రయత్నమో
నచ్చిన దానివెంట పరుగులు
తీరాల వెంబడి
మైదానాలవెంట

ఎవ్వరేమనుకుంటే నాకేం
ఎవ్వరు నవ్వుకుంటే నాకేం
రహస్యమార్గాలేవీ బోధపడవు



అష్టాచెమ్మా ఆటలో గవ్వలు కదిల్చినట్టు
తొక్కుడుబిళ్ళాటలో మువ్వలు సవ్వడిచేసినట్టు

నేనాడే పదరంగాన్ని
చెరుపుకుంటూ తిరిగి రాసుకుంటూ

ఆటలో అరటి పండునై, బట్టమీద బంగారాన్నై
చదరంగం రాకున్నా
నలుగురిలో నేర్చుకున్న చతురతా పావులు కదుపుతూ

ముఖ పుస్తకం పేజి కదిలేలోగా
నాలుగు లైకులు
నాల్గయిన రెండు కామెంట్లకు ప్రతికామెంట్లు

సమయ గడిచిపోయిన స్పృహేలేదు

తూర్పునున శుబోదయం
పశ్చిమాన శుభసాయత్రం

***

మళ్ళీ పరుగులు

వేరే ఎటువైనా పరుగెట్టవచ్చుగా
నిద్రలేచి కళ్ళు నులుముకున్నట్లు
అంతా కొత్తే కదా!
ఎటువైపైతేయేం పరుగేగా కావల్సింది

****

Sunday, 3 March 2013

పొరపాటే

వెన్నెలదారిలో నడవడం
ఆహ్లాదమనుకుంటే పొరపాటే!

సాహసాల సంచిని భుజాన వేసుకొని
రహదార్లు, విద్యుత్తుదీపాలులేని
గుబురు అలుముకున్న చెట్లలోంచి
మెలికలు తిరిగిన కాలిబాటను
ఒంటరిగా నడవడమే!

బాల్యంలో విన్న దెయ్యంకథలు
వెనుకనుంచి విసిరే గాలిలోంచి
చెవిలో గుసగుసలాడొచ్చు

దారితప్పిన గువ్వపిట్ట
గుబులు గుబులుగా పాడేరాగం
వెన్నంటే రావొచ్చు

తప్పిపోయిన కుమారుడు
దూరాన నెగడై ఎందరికో వెచ్చదనానిస్తూ
పిలుస్తున్నట్టే అన్పించొచ్చు

మిణుగురులు పంపే ప్రేమసంకేతాలు
కన్రెప్పలను గుచ్చి గుచ్చి
ఆదమరచిన చెలిజ్ఞాపకాలు
మువ్వల సవ్వడై ముందు నడవనూవచ్చు

పేగుచివర రేగిన ఆకలిమంట
విద్యుల్లతలా ఆవరించి
దేహాన్ని వణించనూవచ్చు

వెన్నెలను ప్రేమించేది
నేనొక్కణ్ణే అనుకుంటే పొరపాటే!

విరహపు రెక్కలను తెరచి
పరిష్వంగం కోసం పరితపించి
నాగరాజులు నాట్యమాడతాయి

రహస్య సంకేతాలను
చేరవేసే నక్కలు ఊళవేస్తాయి

ఇంద్రలోకపు వయ్యారాలను
తలదన్నే కలువభామలు
చెరువు వేదికపై
చంద్రుణ్ణి తేవాలనిచూస్తుంటాయి

ఎవ్వరూ రారక్కడికి
నా వూహలు తప్ప
అల్లుకున్న అక్షరాలు
అప్పుడప్పుడూ పలకరించిపోతుంటాయి

అడుగులను కొలతలుచేసి
ఎన్నిసార్లు ఈ దారిని కొలిచే ప్రయత్నంచేసానో
చీకటిపొరల మధ్యొకసారి
ఆత్రాల అంగలమధ్య ఇంకోసారి
తప్పించుకుంటూనే వుంది

వెన్నల తడిపిన
తెల్లటి బాటవెంట మోసుకుపోతున్నవన్నీ
బుజాన బరువెక్కి
గుండెల్లోకి చేరుతాయి

ఏనాడైతే కాంక్రీటు అడవిలో
బ్రతుకుతెరువు వెదక్కున్నానో
అప్పుడే వెన్నెలను
నియోన్‌లైట్ల కాంతికి కుదువపెట్టడమైయ్యింది

ఇక
వెన్నెలదారిలో నడవడం
ఆహ్లాదమనుకుంటే పొరపాటే!


మొదటి ప్రచురణ వాకిలి లో  
25.01.2013