Monday, 25 November 2013

తెరముందు - తెరవెనుక

తెరముందు సన్మానాలు
తెరవెనుక అవమానం
చూస్తున్న కళ్ళకు కత్తెరపడ్డదేదీ తెలియదు

**
కళ్ళు ముందుకే చూస్తుంటాయి
మనసు నలుమూలకు తిరిగి చూస్తుంది
**
బూడిదెకు ప్రతిగా పూదండను
దుఃఖమునకు ప్రతిగా అనంద తైలమును
అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను
నూతనమైన పేరును కలిగి
రక్షణవస్త్రాన్ని కప్పినవాడు నిరంతము వెంటున్నాడు
**

అవమాన కర్త స్థానం కాళ్ళక్రిందేనని మర్చిపోకు

Saturday, 16 November 2013

అలలపై మెరుపుతీగ


ఎప్పుడో కన్న కల నెరవేరలేదు. కలల ప్రపంచం నుంచి కనుమరుగౌతున్న సచిన్ గుర్తొచ్చి, ఎప్పుడో రాసింది.
****


శ్రీమతి ప్రేమగా
పలుమార్లు పిస్లుస్తున్నా
పలుకని పరద్యానం

పిల్లల ముద్దుపలుకులేవి
తీపిగా రుచించని తనం

టెన్నిస్ తెలియని నాకు
సానియాను ఓడిస్తున్నట్టు
బ్యాటెప్పుడూ పట్టని నేను
సచింతోకలిసి పరుగులుతీస్తున్నట్టు

నారాయణరెడ్డినో
శివారెడ్డినో
అనుసంధానపు దారాలతో
పతంగిలా ఎగరేస్తున్నట్టు

ఎక్కడెక్కడో రగిలి
కమ్ముకుంటున్న చీకట్లతో
ఎండిపోతున్న ఆకలిపేగులో
మెలివేస్తున్న బాధంతా
ఒక్కసారిగా అనుభవిస్తున్నట్టు

వేడిమికి చిట్లిపోయే గాజులా
క్రౌర్యం, కర్కశం పెళ్ళున పగిలి
వీధుల్లో పారుతున్న రక్తం
నాపై ప్రవహిస్తున్నట్టు

ప్రవాహంలో కొట్టుకుపోయే
దేహపుగాయాల సలుపంతా
నా నరాలలోకి ఎగబాకుతున్నట్టు

రాలి ఎండిన ఆకులపై
నడుస్తున్నసవ్వడి వింటున్నట్టు

తపతపమంటున్న బురదదారుల్లో
కాళ్ళపై వస్త్రాన్ని పైకిలాగి
ఆచితూచి అడుగేస్తున్నట్టు

సుదారాలనుండి వస్తున్నాననే
ఆప్తులంపిన సందేశంతో
ఆలస్యమైన రైలుకోసం
గడియారపు ముల్లును
పరీక్షిస్తూ నిరీక్షిస్తున్నట్ట్లు

ధ్యానం కుదని యోగిలా
సీటుదొరకని ప్రయాణికుడిలా
అసహనంగా పచార్లు చేస్తున్నట్ట్లు

శాఖలుగా విస్తరించిన చెట్టు ఆకుల్లోంచి
మెరుస్తున్న సంధ్యలో
ఒక్కవుదుటన
ఎగిరేపక్షుల కోలాహలంలో
నేనో పక్షినై ఎగిరినట్లు

గజగజ వణికిస్తున్న చలిలో
నెచ్చెలివెచ్చని కౌగిట్లో బంధిస్తున్నట్లు

సలసలకాగుతున్న ఎసరు
కుతకుత ఉడికి గంగివంచిన అన్నం
సెగలు పొగలు కక్కుతున్నట్టు

ఆగీఅగి కూతవేస్తున్న కుక్కరులా
చెవిలో ఎదో కూతల రొద
ఓ అలజడి, ఓ బాధ
అది జ్వరంకాదు
అక్షరాలను చెక్కుతున్న ఉలి
పదాలను నెమరేస్తున్న అలికిడి
ఉబుకుతున్న జల
ఎగిసిపడుతున్న తరంగం
***
అప్పుడప్పుడూ
ఉలితో నన్ను నేను చెక్కుకుంటాను
జలాలతో తాలారా స్నానంచేస్తుంటాను
తరంగాన్ని పట్టుకోవడం కోసం
మళ్ళీమళ్ళీ ప్రయత్నిస్తుంటాను

అప్పుడది
అలలపైన తేలియాడే మెరుపుతీగ
నన్ను స్కానుచేస్తున్న యాంటీవైరస్.

........నేటినిజం 11.8.2005.........
 

Wednesday, 13 November 2013

నేస్తంతో ఒకప్పటి సాయత్రం





*
రెండుమనసుల్లోని గూడుకట్టిన దిగులుకు
వంతెన కట్టాలని
ఒకే సీసాలోంచి రెండు గ్లాసుల్లోకి వొంపుకుని
మిక్సర్ పొట్లాం విప్పినట్టు మాటలను విప్పుతాం
పలుగు, పారపెట్టి పెరటిని త్రవ్వినట్టు తవ్వుకుంటాం
**
హఠాత్తుగా
కాలేజీలో యదగిల్లినపిల్ల మద్యకొచ్చి వాలుతుంది
కొన్నివూసులు, గిలిగింతలతో ఊరిస్తుండగా
సీసా ఖాళీతనానికి శబ్దం చేసేసరికి
చటుక్కున ఆ పిల్ల ఎటో ఎగిరిపోతుంది.
***
ఒడ్డున ఖాళీగా లంగరేసిన నావ
గాలికి ఊగినట్టు ఊగుతుంటాయన్నీ
ఎక్కడో దాక్కుందనుకున్న దిగులు నావెక్కి తనూ ఊగుతుంటుంది.
అలల భయాన్ని పోగొట్టేందుకు మరో సీసామూత తెరుచుకుంటుంది.
****
వేగిన ముక్కల్లోంచి బయటపడ్డ బొమికలు
లోలోన అణచిన భాధించేవన్నీ చిరవందరౌతుంటాయి
కాళీయైన ప్లేట్లు
తమనెవారైనా శుభ్రంచేస్తారని ఎదురుచూస్తుంటాయి
*****
ఖాళీయైన సీసాలా దేహం దొర్లుతుంటుంది
******
దేన్ని వంపుకున్నామో
దేన్ని నింపుకున్నామో
తడబడుతూ ధీమాగా నడిచెళ్ళేవైపు
రెండుగ్లాసులు అలుపెరుగక అలానేనిల్చుని చూస్తుంటాయి
*******
బహుశ గ్లాసులకు  తెలియదు
మళ్ళీ కల్సినప్పుడు ముద్దాడేది  వాటినేనని


----------------------------------------------------
4.11.2013  రాత్రి 8-10   గంటలమధ్య