Saturday, 4 August 2007

పాద ముద్రలు


నీవు నడచిన గమనంలో 
పాదముద్రలు లేవు
 
గీసుకున్న ఆశయాల వలయాల మధ్య
 
తోడొస్తానని వెన్నంటిన వారు
 
జీవిత పద్మవ్యూహ పోరాటంలో తడబడినా
 
నీవొక ఒంటరి అభిమన్యుడివి
 
ఆరాటపు జీవన గమనంలో
 
కరుణపై నివురుగప్పి
 
కసినంతా కళ్ళలో నింపుకొని
 
మేకపోతు గాభీర్యంతో
 
మెలిగే నీవొక ఒంటరి హిట్లర్వి
 
అంతర్గత వలయాలలో
 
ఆరబోయలేని మమతానురాగాన్ని
 
మునిపంట నొక్కిన నాడు
 
నీవొక చండశాసనుడివి
 
కంతలబొతకు అతుకులేస్తూ
 
చింకిచాపపై
 
కాళ్ళు కడుపులో ముడుచుకొన్నప్పుడు
 
నీవొక అభిమానధనుడవు
 
అయినా...
 
నీవు నడిచిన బాటలో
పాదముద్రల్లేవు.

******

గొంతెడిపోతున్న వేళ
గొంతులో పోసిన గంజినీళ్ళతో
తెప్పరిల్లిన ఓ ప్రాణి
తెరువు తెలవక రెపరెపలాడుతూ
చీకట్లో తడుముకుంటూ
ఆశాకిరణపు ఆసరానొందిన వాడు
తన జీవిత చక్రకాలంలో
తడారిన కళ్ళాతో తలచుకొన్నప్పుడు
నీవొక మహాత్ముడివి
మసున్న మహరాజువి

ఆ కళ్ళకు నీ పాదముద్రలు గుర్తే
నిశితంగా చూపు నిల్పలేక
ఆ కళ్ళు మసకబారి
తికమకపడి బ్రమపడి
అటో... ఇటో... ఎటో... తొలగిపోయి
పాదముద్రలకోసం
వెతుకుతుంటాయి

అందుకే...
నీవొదిలిన పాదముద్రల్లేవు

పాదముద్రలు లేకున్నా
రేగిన ధూళిలో ఎప్పుడో
నీ పాదం తాకిన రేణువులు
బద్రంగా దాచుకున్న పరిమళాలు
బద్దలుకొట్టి
శిధిలాలనుండి త్రవ్విన
శిలాశాసనంలా
చాటుతాయి.

No comments: