Tuesday, 25 September 2007

వుబికే బిందువుల్లో ఓ నది

(ఎక్స్ రే 2003 _ ఉత్తమ కవిత పురస్కారం డా. మిక్కిలినేని, శ్రీ శివారెడ్డి తదితరులు)

జీవనతీరాలలో

ఓ నది ప్రవహించింది

వురకలు వేసింది

పరవళ్ళు తొక్కింది

ప్రసాంతంగా నడిచింది

మలలమాడ్చిన ఎండల్లో

పొడిబారిన ఇసుకతెన్నెల్లో

సన్ననితీగై సాగింది

ఎడతెరుపెరుగని జల్లుల్లో

ఎదనిండా బురదున్నా

వురికి వురికి పొర్లింది

పాయలుగా రేవులుగా మారి

వురికి వచ్చే దాహార్తులకు

దాహం తీరుస్తూ

ఈతలు నేర్పుతూ

నిరంతర వాహినిగా

ప్రవాహపు నాదాన్ని, ఖేదాన్ని

అంతఃరాల లోతులలో దాచుకొని పారింది

పాఠాలు నేర్పింది

రాదారుల్ని పరచింది

జీవం పోయిందని

గుప్పేడుమట్టితో పూడ్చడానికి

తరలిపోయే ప్రవాహం

తలో పిడికిలితో గుట్టలుచేసినా

నిశ్శబ్దంగా

వుబికే బిందువుల్లో

నిశ్ఛింతగా నిదురోతున్నది

ఎప్పుడో

దోసిళ్ళు దాగిన నీళ్ళు

ఇప్పుడు అదే దోసిళ్ళలో

అశ్రువులై ప్రవహిస్తున్నాయి



ఎక్స్ రే 2003 _ ఉత్తమ కవిత పురస్కారం
విశాలాంద్ర 24.4.2005
జీవనోత్సవం _ సంకలనం

చెట్టంటే భయపడే మనసు

మొక్కగా ఎదుగుతున్నప్పుడు

లాలించే మనసు

చెట్టుగా ఎదుగుతుంటే భయపడ్తుంది

విస్తరించే కొమ్మల్లో ఏ నీడలుంటాయో?

చెట్టు జ్ఞానానికి ప్రతీకయే

ముచ్చటపడి కట్టుకున్న సరిహద్దుగోడలు

కూలిపోతాయంటే భయం

ఎండపొడ తగలనివ్వని

కాక్రీటు చెట్ల మధ్య

పత్రహరితానికై విలవిలలాడే కొమ్మలు

ఏమి యెదుగుతాయంటూ

ఏ దిక్కులోనో దాచిని వాస్తుగా

అవసరాల విద్యుత్తు కాంతికి

అడ్డు తగులుతున్నాయంటూ

చేతులను నరకడానికే ప్రయత్నలు జరుగుతుంటాయి

ఎన్ని భ్యయాలు ముసురుతున్నంత వరకూ

చిగురులుతొడిగే చెట్టులా

ఏదగడమే లక్ష్యం
११.११.२००५

Sunday, 23 September 2007

ప్రదర్శనకు టిక్కెట్లు


గింజలకి ఆశపడి

ప్రాణాల్ని పణంగా పెట్టడం

మామూలైపోయింది

కాలే కడుపుకు

ఆశల ముడుపుకు

తిరిగే కళ్ళముందు

చుట్టేసే మోహమెప్పుడూ

ఆలోచన దారులన్నింటిని మింగేస్తుంది

మెలకువలోనో బ్రతుకులోనో

కనులు తెరిచి చూస్తే

పైరు మట్టిపై

మొలుచుకొచ్చిన కాంక్రీటు మొలకల్లో

బొటనవేళ్ళూ కండరాళ్ళతో

ప్రదర్శనశాల బహిర్గతమయ్యింది

అడుగులు నేర్చిన నేలపైకి

పాదం మోపడానికి

టిక్కెట్లు అమ్మబడుతున్నాయి.

10.11.2005

Friday, 21 September 2007

ఏదైనా...!

ఏదైనా...!

అదో తేనెతుట్ట

ఆదమరచి పొడిచావో

ఈగలుచుట్టి మిట్టడి చేస్తాయి

ఒడుపెరిగావో

దారల దారల తేనంతా నీదే

ఇంకాస్త ముందుకుపో

రాణీ ఈగ నిన్ను మోహిస్తుంది

మిగతావన్నీ నీవెంటే.

Monday, 17 September 2007

వెట్టికి రహస్యద్వారాలు

పరవబడుతున్న రోడ్లన్నీ నీకోసమేనంటూ
కట్టబడుతున్న తోరణాల నీడల్లో
రాస్తున్న వీలునామాలన్నీ

ఎవరిజీవితాలనో కుదువపెడ్తున్న వైనం

రింగు రింగు పథకాలతో

కాసును ఎరవేసి

పాదంక్రింద నేలను లాక్కుపోతూ

పుట్టిన గడ్డపై పరాయి బ్రతుకులకై
ఏ గద్దో ఎర్రతివాచీ పరచి ఎదురుచూస్తోంది

అడుగునేలుంటే కళ్ళముందు

అమ్ముకున్న కళ్ళలో

అగుపించేదంతా రంగుల స్వప్నమే

కాగితాల గీతల్లో

బహుళ అంతస్తుల్లో బజార్లు కనిపిస్తుంటాయి

నిన్నటివరకూ భుజంరాసుకున్న

జొన్నకంకి శత్రువై కనిపిస్తుంది

నడపబడుతున్న బుల్డోజరుక్రింద

నలుగుతున్న రూపమేదో

నుజ్జు నుజ్జుగా చిద్రమౌతోంది

ఎవరిదోకల మొలకలై పొడుచుకొచ్చి

రాజదండం వూపుతోంది

ఇక్కడన్నీ వుచిత పథకాలే

ఒక్కసారి తలవూపడమే తరువాయి

ఆనందించే మార్గాలన్నీ పరచబడతాయి

వ్యూహం కనబడని సాలెగూడు వలడుగున

బానిస్త్వానికి పునాదులు తవ్వబడతాయి

అది వుచితం ఇది వుచితం

రాబోయే సంవత్సరాలన్నీ ఉచితం

నిబంధనలు వర్తించడనికి

ఏదో లొసుగు దాగేవుంటుంది

కార్చే చమటకు

ముందస్తు హామీల గణాంకాలు

వెట్టిచేయడానికి రహస్యద్వారాలు

Monday, 3 September 2007

హోర్డింగుల బోర్డింగులు

ఊహకు ప్రతిరూపమిచ్చిన
హోర్డింగులకు

బోర్డింగిచ్చిన నగరం

ఈనెలు ఈనెలుగా సాగినఊహలు

డిజిటల్ సృజనాత్మకత

కొత్తటేస్టుల పేపరుపై పేస్టుచేస్తూ

బెస్టు బెస్టంటూ

ట్విస్టుల అక్షరాలు

ప్రీస్టులైనట్టు చూపులతో

హోరెత్తించే జిమ్మిక్కుల కిక్కుతో

మూడు ఆరైనా ఆరుమూడైనా

మూడ్సు నీవేనంటూ

దునియాని దుప్పటిచేసి పక్కపర్చుకోవాలని

హవాలో హవాయిగా ధరించాలని

నెట్టువర్కుల దారంతో

ప్రపంచాన్ని పాదాక్రాంతం చేయాలని

ట్రకు ట్రకుల పోటీల ఫీట్సుచేస్తూ

రూపాయిని పాపాయి చేసి

బారసాలకు బారి హోర్డింగులకు

బోర్డింగిచ్చిన నా నగరం


నానా గరం

ప్రస్తుతం హోర్డింగులమయం.