ఒకడు కలకంటున్నాడు
రెపరెపలాడుతున్న
తూనీగల్నో తుమ్మెదల్నో పట్టాలని
వెంటాడుతున్న బాల్యపుచేష్టలా
రంగులవైపు పరుగెడుతూ
అందాన్నేదో వెతుక్కుంటూ
అతడు కలకంటున్నాడు
ఒకడు కలకంటున్నాడు
అలసిన దేహంతో
జాము జాముకు కూసే
కోడిపుంజులా నిద్రిస్తూ
మైళ్ళు, సంవత్సరాల వేగంతో నడుస్తూ
తనలోనికో, బయటకో
విధుల్లోకో దేశాల్లోకో
సముద్రాల్లోకో, దేశదేశాల్లోకో
రహదారి వెంట
రాల్తున్న గుల్మోహర్ రేకల్లా
అక్షరాలను ఏరుకుంటూ
జీవితాన్ని మంత్రించిన పుష్పంచేసి
కాగితపు మడతల్లో
పుస్తకమై నిలిచిపోవాలని
అతడు కలకంటున్నాడు
ఒకడు కలకంటున్నాడు
ఆహ్లాద దేహంతో
కలకనే వేళ
కళ్ళలో గుచ్చుకుంటున్న
ముళ్ళలాంటి వాస్తవాల మధ్య పడిలేస్తూ
పొడిచే ముళ్ళను నరుకుతూ
గాయపడుతూ
గేయమౌతూ
శతాబ్దాలుగా కూరుకుపోతున్న
బురదవీధుల్లోంచి
నల్గురు నడిచే దారికోసం
చూపుడువేలై నిలవాలని
అతడు కల కంటున్నాడు
ఏ కలా లేకుండా
ఎన్ని ఏళ్ళగానో
మోయాలని ప్రయత్నిస్తున్నా
పథకాలు రచిస్తున్నా
ఇప్పుడే ఎదిగొచ్చినవాడు
నగ్నదేహంపై వస్త్రంలా తొడుక్కొని
అడుగులేసే పాదాలకు
పాదరక్షలుగా తొడుక్కొని
క్షణమో అరక్షణమో కాదు
గజమో మైలో కాదు
నిరంతర యానంలోకి
మోసుకెళ్తున్నాడు
నేనే చూస్తూ నిలుచుండిపోయాను
5 comments:
"రహదారి వెంట
రాల్తున్న గుల్మోహర్ రేకల్లా
అక్షరాలను ఏరుకుంటూ
జీవితాన్ని మంత్రించిన పుష్పంచేసి"....ఇలా ఎన్నని ఇక్కడ పేస్ట్ చెయ్యను...మీ కాలాన్ని వేస్ట్ చెయ్యను? అన్నీ బాగున్నాయి...అంతా బావుంది.కానీ ఒకటె బాధ. అన్నీ మీరే రాసేస్తే ఇక నేనేం రాసేది అని...సర్లెండి..ఇవి చదివితే చాలు.....వాసుదేవ్
వాసుదేవ్
చదివి ఆనందించినందుకు నా కవిత్వ లక్ష్యం కొంతన్న చేరిందని సంతోషం ఇందులో ఒక్క శివారెడ్డే కాదు ఇంకా అలాంటివారు కొందరు కనిపిస్తారు నిశితంగా గమనిస్తే.
ధన్యవాదములు
చాలా బావుంది జాన్‌గారు. మనసును ఆహ్లాదం కమ్మేసింది.
Post a Comment