Wednesday, 30 May 2012

నన్ను ఎవరో చదివారు

ఈ రోజు
నన్ను ఎవరో చదవాలని ప్రయత్నించారు
ఏమి స్ఫురించిందో
పెదవి విరుచుకుంటూ వెళ్ళిపోయారు

నన్ను ఎవరో చదివారు
విద్యాబుద్దులు నేర్పిన గురువుల
చిత్రపటాలను ఎవరో తడిమి చూశారు

ఆ మూల గదిలో పడవేసినవాటిని
మళ్ళీ గోడలకు తగిలించారు

నా నడకకు సత్తువ నిచ్చే ఎముకలు కీళ్ళను
ఎవరో స్పృశించారు
నడకతీరును గమనించి
ఎవరికివారు ఊహా చిత్రాలను గీస్తుంటే
నా మేథో సంపత్తికి గర్వంతో తల ఎగరవేశాను

కళ్ళకు కనపడని గుండె కవాటాల మూలల్లో
ఎక్కడో దాగిన
గురువుల కంఠస్వరాన్ని వినిపించారు
వారి స్వరాల భుజాలపై నే వూరేగుతున్నాను

హృదయపు పలకపై చెక్కిన అక్షరాలు
ఎన్నడూ నే గమనించకున్నా
శిలా శాసనాలై జీవితాన్ని నడిపిస్తున్నాయి
సముద్రాల ఆవలితీరాలను ముడివేస్తున్నాయి

నేను చేసిందేమిటని తిరిగి చూశాను
ఎంత వెదకినా నాదంటూ ఏమీ లేదక్కడ
నీవు చదవటం కోసం పుస్తకాన్ని తెరిచి వుంచానంతే

ఈ రోజు
నన్ను ఎవరో చదవాలని ప్రయత్నించారు
నా గురువులను చదివారు
***
ఈ మాట లో ప్రచురణ జనవరి 2012
www.eemaata.com/em/issues/201201/1886.html

****
విద్యాబుద్దులు నేర్పిన గురువులు
జీవితంలో ఏదో ఒక విషయాన్ని నేర్పుతున్న గురువులకు
వినయంగా అంకితం

Sunday, 27 May 2012

గాలిలో తేల్చి వుంచాలనుకుంటాను

 జాన్‍   హైడ్ కనుమూరి

దేహాన్ని 
గాలిలో తేల్చి వుంచాలనుకుంటాను
 అది ఎగరడమని నీవంటావు 
ఆకర్షణేదో క్రిందికి లాగిపెడ్తుంది 
నా ప్రయత్నాలకు రెక్కలులేవని గుర్తుకొస్తుంది
గమ్యాన్ని చూసే కళ్ళపై రెప్పలు భారమనిపిస్తాయి 
కునుకుపడిందో 
కలలన్నీ భూకంపపు భవనశిధిలాలౌతాయి 
భారమైన కదలికల్లోంచి 
కుబుసం విడిచిన దేహం విడిపోతుంది 
అడుగులు చక్రాలై కదిలిపోతాయి 
చాపిన హస్తం అందుకోవడానికి వురకలువేస్తుంది 
నిలిపినచూపు  
నిరంతరం సంఘర్షణల మధ్య నలుగుతూంది 
రెక్కలగుఱ్ఱంపై రాజకుమారుడు నావైపే వస్తుంటాడు