Wednesday, 30 May 2012

నన్ను ఎవరో చదివారు

ఈ రోజు
నన్ను ఎవరో చదవాలని ప్రయత్నించారు
ఏమి స్ఫురించిందో
పెదవి విరుచుకుంటూ వెళ్ళిపోయారు

నన్ను ఎవరో చదివారు
విద్యాబుద్దులు నేర్పిన గురువుల
చిత్రపటాలను ఎవరో తడిమి చూశారు

ఆ మూల గదిలో పడవేసినవాటిని
మళ్ళీ గోడలకు తగిలించారు

నా నడకకు సత్తువ నిచ్చే ఎముకలు కీళ్ళను
ఎవరో స్పృశించారు
నడకతీరును గమనించి
ఎవరికివారు ఊహా చిత్రాలను గీస్తుంటే
నా మేథో సంపత్తికి గర్వంతో తల ఎగరవేశాను

కళ్ళకు కనపడని గుండె కవాటాల మూలల్లో
ఎక్కడో దాగిన
గురువుల కంఠస్వరాన్ని వినిపించారు
వారి స్వరాల భుజాలపై నే వూరేగుతున్నాను

హృదయపు పలకపై చెక్కిన అక్షరాలు
ఎన్నడూ నే గమనించకున్నా
శిలా శాసనాలై జీవితాన్ని నడిపిస్తున్నాయి
సముద్రాల ఆవలితీరాలను ముడివేస్తున్నాయి

నేను చేసిందేమిటని తిరిగి చూశాను
ఎంత వెదకినా నాదంటూ ఏమీ లేదక్కడ
నీవు చదవటం కోసం పుస్తకాన్ని తెరిచి వుంచానంతే

ఈ రోజు
నన్ను ఎవరో చదవాలని ప్రయత్నించారు
నా గురువులను చదివారు
***
ఈ మాట లో ప్రచురణ జనవరి 2012
www.eemaata.com/em/issues/201201/1886.html

****
విద్యాబుద్దులు నేర్పిన గురువులు
జీవితంలో ఏదో ఒక విషయాన్ని నేర్పుతున్న గురువులకు
వినయంగా అంకితం

5 comments:

మెర్సీ మార్గరెట్ said...

chalaa baagaa avishkarincharu sir .. mee bhavanalanu .. naaku naa badi jeevitham gurthochindi ..

కెక్యూబ్ వర్మ said...

బతుకు పాఠాన్ని చదివించారు సార్... గురువులకు ప్రణామములు..

Apparao said...

పెద్ద మనస్సు తో నన్ను క్షమించాలి

ఈ రోజు నన్ను ఎవరో చదివారు
"ఎవడీడు ఈ పిచ్చి రాతలు" అని పెదవి విరిచి వెళ్ళిపోయారు
"వీడికి చదువు నేర్పిన గురువులు ఎవరు?" అని నా గురుదేవులని తిట్టారు
మూలాన పారేసిన తెలుగు అక్షర మాలికను మళ్ళి గోడకి తగిలించారు
నా నడక సరిగ్గా లేదని నా కాళ్ళ ఎముకలను విరక్కోట్టారు
నేను రాసినది ఏమిటి అని వెనక్కి తిరిగి చూసాను
అన్నీ పిచ్చిరాతలు
అయినా కానీ నా పిచ్చి రాతల పుస్తకాన్ని తెరిచి ఉంచాను

Padmarpita said...

chaalaa baagundandi.

భాస్కర్ కె said...

bhaagundi sir.