Friday, 10 May 2013

వేకువనే మోకరించే ఆమె


అమె మోకరించిన ప్రతీసారీ
ఎవరో ఒకరిని ఆదరించడాన్కి
శక్తినేదో కూడగట్టుకుంటుంది

వేకువలో పాడే ఆమెగొంతులోంచి
విడుదలయ్యే ధ్వని తరంగం
నిరంతరంగా
ప్రకంపనాలు రేపుతుంటాయి

ఎక్కడ్నుండి సంకేతమొస్తుందో
ఆమె దర్శించిన ఇంటిలో
అనారోగ్యమో, దిగులో
తన స్పర్శా తాకిడికోసం ఎదురుచూస్తుంటుంది

దిగులుచెందిన గుండె ఒకటి
కన్నీరై ఒలికి
ఆమెను హత్తుకొని ఉపశమనం పొందుతుంది

స్వస్థతా హస్తంగా
ఆ వీధిమొగలో కొందరి నాలుకల్లో నానుతుండేది

ఆమె సామాన్యమైనదే
అక్షరసౌందర్యాలు తెలియనిదే
మోకరించిన వేకువలో సత్తువను సంతరించుకొనేది

* * *
అమ్మా!
నీతో మోకరించిన వేకువలు
నా జీవిత పథాన్ని నడిపిస్తున్నాయి.

* * *

అమ్మను గుర్తుచేసుకోవడం జ్ఞాపకమేనా!


-------------------------
మదర్స్ డే సందర్భంగా  

Saturday, 4 May 2013

క్షణికమైన భయం మాటున వొదిగి


క్షణికమైన భయం మాటున వొదిగి
అబద్దమాడటం
ధర్మరాజుకే తప్పలేదంటూ
యేసు శిష్యరికంలో మెలిగిన
పేతురుకే తప్పలేదంటూ
సాకుల పరదా వేసుకుంటాము
ఎవ్వరూ
నిజాన్ని అబద్ధంగానూ,
అబద్ధాన్ని నిజంగానూ మార్చలేరు
అహంకారపు కిరీటాన్ని కాలదన్నేవాడు
ఏదోమూల తన ఇంటనే పుడ్తాడని తెలిస్తే
క్రౌర్యం కమ్మిన కళ్ళతో
శిశుహత్యా పాతకానికి కత్తి ఝుళిపించబడుతుంది
అయినా
కిరీటం ఎవరికి నిలబడిందని?
అబద్దాల వంతెనపై నడుస్తూ
లాలించడానికో వెన్నెల మొక్కను
కిటికీకి తగిలించాలనుకుంటాం!
పాలించడానికో సూర్య కిరణాన్ని తెంపి
గుమ్మానికి తోరణం కట్టాలనుకుంటాం!
ఏదీ నెరవేరని అయోమయమౌతుంది.
ఆకలి పేగుకు
అబద్దాల బిర్యానీ రుచించదు
సాకుల పరదాను చించి
గొంతు చించుకొని అరుస్తుంది.
అడుగులు లిఖించే
అబద్ధాల చిట్టాకు కొలమానమెక్కడ?
భయం లేకుండా నిర్భయంగా
అడ్డొచ్చిన నీటి ప్రవాహాన్ని దాటాల్సిందే!
పాదం మోపినప్పుడు
తడిసే కాలు అబద్దం కాదు 
published ఈమాట.కాం March 2013

చిట్టి పాదాలు


నీ కోసం ఎంతగా ఎదురు చూస్తానో తెలుసా?
నీకెలా తెలుస్తుంది? 

చిట్టి పాదాలతో
పారాడిన నేలంతా ఎంతగా మారిందో తెలుసా!

పిచ్చిదానా !
ఇంకా నావి చిట్టిపాదలేనా అని నువ్వంటావు

నేను ముద్దాడిందీ
లాల పోసిందీ
యెదపై గిలిగింతగా తన్నిందీ

ఒక్కో నరాన్నీ కూడదీసుకొని
తప్పటడుగులు వేసిందీ
నా కొంగు పట్టుకొని
వంటిల్లంతా తిరిగిందీ
ఆ పాదాలే కదా!

నాకింకా ఆ పాదాలసవ్వడి
మనసు పొరల్లో దాగిన
నా బాల్యం ధ్వనిస్తూనేవుంది

అందుకే నీ కోసం
ఎంతగా ఎదురు చూస్తానో తెలుసా?

****
"రాధిక రిమ్మలపూడి" తో చాలా కాలం తర్వాత చాట్ చేసాక