Friday, 10 May 2013

వేకువనే మోకరించే ఆమె


అమె మోకరించిన ప్రతీసారీ
ఎవరో ఒకరిని ఆదరించడాన్కి
శక్తినేదో కూడగట్టుకుంటుంది

వేకువలో పాడే ఆమెగొంతులోంచి
విడుదలయ్యే ధ్వని తరంగం
నిరంతరంగా
ప్రకంపనాలు రేపుతుంటాయి

ఎక్కడ్నుండి సంకేతమొస్తుందో
ఆమె దర్శించిన ఇంటిలో
అనారోగ్యమో, దిగులో
తన స్పర్శా తాకిడికోసం ఎదురుచూస్తుంటుంది

దిగులుచెందిన గుండె ఒకటి
కన్నీరై ఒలికి
ఆమెను హత్తుకొని ఉపశమనం పొందుతుంది

స్వస్థతా హస్తంగా
ఆ వీధిమొగలో కొందరి నాలుకల్లో నానుతుండేది

ఆమె సామాన్యమైనదే
అక్షరసౌందర్యాలు తెలియనిదే
మోకరించిన వేకువలో సత్తువను సంతరించుకొనేది

* * *
అమ్మా!
నీతో మోకరించిన వేకువలు
నా జీవిత పథాన్ని నడిపిస్తున్నాయి.

* * *

అమ్మను గుర్తుచేసుకోవడం జ్ఞాపకమేనా!


-------------------------
మదర్స్ డే సందర్భంగా  

2 comments:

కనకాంబరం said...

అమ్మ ఎక్కడైనా, ఎవరైనా, ఎవరికైనా, అమ్మే .అమ్మ నిరంతరం మన కనులముందు కదలాడే నిరంతర సజీవ మూర్తి జ్ఞాపకం కాదు .గుర్తూ కాదు.,...(కనకాంబరం) ..నూతక్కిరాఘవేంద్ర రావు.

జాన్‌హైడ్ కనుమూరి said...

Nutakki Raghavendra Rao gaaru

thank you very much