Tuesday, 30 July 2013

పడిలేవడం



మేధస్సు
సాంకేతికాక్షరాల మధింపు
డిజిటల్లో, అనలాగ్గో పరికరాల సూచికల్తో
నా భద్రతను అంచనా వేసుకుంటాను

ఎదిగిన పరిజ్ఞానంతో
ఎన్ని దారుల్ని పరుచుకున్నానో !

అభద్రతా గుండంలోకి
జారిపోయిన క్షణం ఊహించని ప్రవాహం!

నే నిలబెట్టిన శివుణ్ణి తోసుకుంటూ
గంగవేసే ఉరకలు
కాళ్ళక్రింద మట్టిని కోస్తూ
నన్నూ నా శివుణ్ణీ భ్రమింపచేసాయి

నా జ్ఞానాన్ని
అజ్ఞానంలోకి నెట్టేస్తూ, ప్రశ్నిస్తూ
ఒక బీభత్సం

గల్లంతైన దేహాలు
కూకటివేళ్ళతో కొట్టుకుపోయిన భవనాలు
లయతప్పిన ప్రకృతి నృత్యం
వరదవదిలెళ్ళిన బురద

కాళ్ళు ఆరనివ్వని నీటి మధ్య
గొంతు తడుపుకోలేక కన్నీటిని చప్పరిస్తున్నాను

ఆకలి.. భయం… నిస్సత్తువ…
ఇంకా కేకలు వేస్తూనేవున్నాయి

నాకిప్పుడు దార్లు

-నానిన నీటిలోంచిపుట్టే అంకురానికొక నేలను సిద్దం చేయడం
అప్పటివరకూ నన్ను నేను బ్రతికించుకోవాలి

-మోకరిల్లే దిక్కుకోసం దృక్కులు చూడటం

                   ***

నీ వైపు చూడటం అత్యాశేమీ కాదు
పడిలేవటం కెరటానికి నాకూ అలవాటేగా!


http://vaakili.com/patrika/?p=3431


Tuesday, 16 July 2013

ప్రేమిస్తూనే

ప్రేమిస్తూనే వున్నా 
అమ్మ చెప్పిందని 
ఉపాద్యాయులు చెప్పారని 
ఆదివారం ఆదివారం వెళ్ళిన సండేస్కూలు నేర్చిన
నిన్నువలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని యేసు చెప్పాడని
ప్రేమిస్తూనే వున్నా
***
 
ఇంత వయసొచ్చాక
దేన్ని ప్రేమిస్తున్నానని సందేహమొచ్చింది
నన్నునేనే విభాగాలు విభాగాలుగా
విభజించుకున్నాక 
సందేహమొచ్చిందంటే గొప్ప విషయమే
*** 
రాగలవా! ఇటు, 
"కుప్పపోసిన ఇసుకలో 
దూ..దూ.. పుల్లంటూ ఆడుకుందాం"
ఇప్పుడే తొలకరించిన మేఘం క్రింద 
వానా వానా వల్లప్పా పాడుతూ ఆడుకుందాం
 
గతమైపోయిన నోటుబుక్కుల్లోంచి 
కాగితాలు చింపి పడవలు చేసి 
తొలకరి చినుకుల్తో నీళ్ళునిల్చిన చోటుల్లో వేద్దాం
 
నీ కరచాలనంకోసం
తహతహలాడుతుంది ఈ క్షణం 
ఎన్నిసార్లడిగినా చెప్పగలను 
"ప్రేమిస్తూనే వున్నానని."
 
----------------------జాన్ హైడ్ కనుమూరి 

Saturday, 13 July 2013

రాత్రంతా వర్షం కురుస్తోంది



వేకువనే తనువంతా అరగదీస్తూ
వాకిలిని ఊడ్చిన చీపురును
ఎవరు పలకరిస్తారిప్పుడు
ఏదోమూల అలా స్తబ్దుగావుంది

బురదనిండిన వాకిలిని చూసావా
పాదానికి అంటకుండా
అక్కడక్కడా వేసిన రాళ్ళపైనుండి
అంగలువేస్తూ నడవడం గమనించావా!

పొటమరించిన అంకురాలతో
నునులేతపచ్చరంగు అలుముకొని
శింగారించుకుని
నారుమడులు, నాట్ల మధ్య
ఆరేసిన పొలాల కలనేత ఊరు

బురదవీధుల్లో నడిచెళ్ళిన పశువులమధ్య
గిట్టలగుర్తులతో
ఆవేదో, గేదేదో, ఎద్దేదో
ఎటుగా వెళ్లిందో పసిగట్టడం నేర్చావా!

పశువులను తోసుకుంటూ
నీరునిండిన గుంతలను దాటుతూ
సన్నగా కురిసే చినుకులకు
పలక నెత్తినపెట్టి పరుగెట్టి
బడి గిలకబావిని
చేదుకున్న నీళ్ళో
కడుకున్న కాళ్ళో గమనించావా!

ఈ రాత్రంతా వర్షం కురియాలి

గుమ్మపాల నురగలతో
స్వచ్చతనేదోవెతుక్కుంటూ
వాకిట నిలబడి
నీకోసం పడవలను వదులుతాను!