Tuesday, 16 July 2013

ప్రేమిస్తూనే

ప్రేమిస్తూనే వున్నా 
అమ్మ చెప్పిందని 
ఉపాద్యాయులు చెప్పారని 
ఆదివారం ఆదివారం వెళ్ళిన సండేస్కూలు నేర్చిన
నిన్నువలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని యేసు చెప్పాడని
ప్రేమిస్తూనే వున్నా
***
 
ఇంత వయసొచ్చాక
దేన్ని ప్రేమిస్తున్నానని సందేహమొచ్చింది
నన్నునేనే విభాగాలు విభాగాలుగా
విభజించుకున్నాక 
సందేహమొచ్చిందంటే గొప్ప విషయమే
*** 
రాగలవా! ఇటు, 
"కుప్పపోసిన ఇసుకలో 
దూ..దూ.. పుల్లంటూ ఆడుకుందాం"
ఇప్పుడే తొలకరించిన మేఘం క్రింద 
వానా వానా వల్లప్పా పాడుతూ ఆడుకుందాం
 
గతమైపోయిన నోటుబుక్కుల్లోంచి 
కాగితాలు చింపి పడవలు చేసి 
తొలకరి చినుకుల్తో నీళ్ళునిల్చిన చోటుల్లో వేద్దాం
 
నీ కరచాలనంకోసం
తహతహలాడుతుంది ఈ క్షణం 
ఎన్నిసార్లడిగినా చెప్పగలను 
"ప్రేమిస్తూనే వున్నానని."
 
----------------------జాన్ హైడ్ కనుమూరి 

1 comment:

Unknown said...

కవన అలలపై జాన్ కళల కలల తీగను సాహితీ ప్రేమికులందరూ నిరంతరం ప్రేమిస్తూనే ఉంటారు!!!