Monday, 26 August 2013
Tuesday, 13 August 2013
సాయంకాల అనుభవం
సాయంత్రాలు, చెట్టునీడ ఒకప్పుడు కొత్తకాదు
విశాలపరచుకుంటున్న రహదార్లమధ్య నలిగి
అనంతానంత చక్రాలు దూసుకొస్తుంటే
తలపోయడంమే మిగిలింది.
* * *
అనుకోని సమయం ఎదురైనప్పుడు
ఒక సాయత్రం
ఒక చెట్టునీడ
వెన్నెల పరిచేందుకు సన్నాహం
జరీఅంచు చీరకట్టిన ఆకాశం
చినుకులై పలకరించకుండా ఎలావుంటుంది?
ధ్వనించే అక్షరాలు పుప్పొడులై రాలినచోట
నింగికెక్కిన చుక్కలు దిగివచ్చి పలకరించకుండా ఎలావుంటాయి?
అక్షరాలు రెక్కలుతొడిగి
చెట్టుకొమ్మలకు వ్రేల్లాడుతూ
నేర్చిన సంగీతమేదో ఆలపించకుండా ఎలావుంటాయి.?
* * *
అది...
ఎప్పుడో విన్న చదివిన పద్యమే కావొచ్చు
ఎప్పుడో కలిపిన హస్తమే కావచ్చు
ఎప్పుడో నడిచిన మార్గమే కావొచ్చు
కొన్ని జ్ఞాపకాలవెంట పరుగులెట్టి
చలికోసంవేసుకున్న ఉన్నివస్త్రాలను విప్పకుండా ఎలా ఉండటం?
నిద్రమాను పత్రాలు ముకిళితమౌతూ వెన్నెలను ఆహ్వానిస్తుంది
కాడమల్లె(నైట్‌క్వీన్) చుట్టూ పరిమళాన్ని పరుస్తుంది
అంతరళాలలోని కోకిల కొత్తపాటను సిద్దంచేస్తుంది
ఇక సాయత్రం ఆ చెట్టునీడ
మరో సన్నాహంకోసం ఎదుచూడకుండా ఎలావుంటుంది ?
రెప్పలనుంచి లోలోకి నడచిన పాదముద్రలు
భద్రపర్చేందుకు నన్ను నేను సిద్ధం చెసుకోకుండా ఎలా ఉండటం?
Saturday, 3 August 2013
వదలని కుబుసం
ఒకప్పుడు భయంలేని రాత్రి
ఇప్పుడు భయపెడుతోంది
ప్రతినిత్యం ఏదొక కల
నిద్రలోనే జారిపోతుంది
యవ్వనాన్ని నింపుకొని నడుస్తున్న
దారిలో
ఎండను మబ్బుకమ్మినట్టు
ఆవహించిన ఒకానొక క్షణం
గమ్యం కానరాని
నిశిరాత్రి రంగుపులిమి
ఎన్నటికీ తరగని ఎడారులపైపు రాత్రిని
పరిచింది
యవ్వనాన్ని సాహసంచేసి నడుస్తున్న
దారిలో
చీకటినిఛేదించే ఆలోచనాయుధం
ఆవహించిన ఒకానొక క్షణం
ఆకులు, కొమ్మలు కప్పుకున్న
నిఘూడ అడవిలో
రాత్రిచేసే కీచురాళ్ళధ్వని సంగీతాన్ని
ఒంపింది
యవ్వనాన్ని మేథో కవనంచేసిన దారిలో
ఆకర్షించిన డాలరుగీతం
పొదలనుదాటి పుప్పొడులను దాటి
డయస్పోరాలను కౌగలించుకున్న క్షణం
నా రాత్రులనన్నీ మింగేసింది
కుబుసం విడిచినట్టు
రాత్రిని వదిలేయాలని ప్రయత్నం
ఎంతకీ విడవదే !
Subscribe to:
Posts (Atom)