Monday, 30 September 2013

ప్యార్ హువా ఎక్‌రార్ హువా




ఇన్నేళ్ళ తర్వాత 
మళ్ళీ
నర్గీస్ నీపై ప్రేమ పుట్టింది

వర్షం కురుస్తున్న రహదారిపై 
ఒంటరితనం బిక్కుబిక్కు మంటోంది
ఇప్పుడు ఎక్కడ వెదాకాలి?

ఇప్పుడు కూడా గుండె వేగంగా కొట్టుకుంటుంది

కాలం రహదారిపై వాహనమై లైట్లు వేసుకుని నిన్ను దాటిపోయి 
కనుచూపులో కనుమరుగయ్యింది

ఎక్కడవెదకాలి నిన్ను?
జ్ఞాపకాల గుర్తులు మిగిలేవుంటాయిలే ఎప్పటికీ.



(ప్యార్ హువా ఎక్‌రార్ హువా - శ్రీ 420 పాట చూసి )
http://youtu.be/y01uvU0UAoU

Thursday, 19 September 2013

యుద్ధం...యుద్ధం...

|
కాలానికి ఏదో అంచున నీవు నేను
యుద్ధం మొదలయ్యిందిప్పుడే

నిన్ను చెక్కినవాడు
చేతివేళ్ళకు యుద్ధ తంత్రాన్ని నేర్పాడు తెలుసా!

వాక్యమనే రెండంచుల ఖడ్గాన్ని
వేళ్ళు ముడిచిన గుప్పెటలో పెట్టాడు

పలుకుతున్న కొద్దీ తెగిపడుతున్న
అంగాలు  ఎవరివో చూసావా!

తెగిపడ్డ వాటినుంచి మొలకెత్తే సాయుధులు
ఏపక్షాన్ని వహిస్తున్నారో గమనించావా!

***

ఒక్కోసారి యుద్ధతంత్రాలన్నీ
ఎండిన ఎముకల లోయైనప్పుడు
శబ్దించే నినాదమై
వెంటుండే సైన్యాన్ని ఊహించి పిలువగలవా

శత్రువును బలాబలాల ప్రక్కకు తోసి
నిరాయుధుడననే  దిగులుమాని ఎదిరించడానికి
తెగువ చూపగలవా!

***

యూద్ధం అనివార్యం
నీ చుట్టూ అందరూ యుద్ధాన్ని నేర్చినవారే
అయినా
కుటుంబమని, బంధువర్గమని బ్రమ పడుతుంటావు
ఎవరి యుద్ధం వారిదే.

***

సుడులు తిరిగే ఆలోచనలు
తేనెటీగల్ల రేగినప్పుడు
యుద్ధనైపుణ్యాలను సాధన చెయ్యాలి

కాలానికి ఏదో అంచున నీవు నేను
ప్రతిక్షణం యుద్ధం కొత్తగా  మొదలౌతుంది.

------------------------------19.9.2013 6:17 hours ISD

Monday, 9 September 2013

ఎవరికి ఇష్టముంటుంది?



జీవనాన్ని నిర్మానుష్య రోడ్లలో కోల్పోవడం
కలతచెందిన కళ్ళలో కలనిచ్చే రాత్రిని కోల్పోవడం

అనుబంధం ముడివేసుకుని
పాలుతాగే లేతపెదవికి స్తన్యం కోల్పోవడం

బిడ్డనుపొంది సహచరి కోల్పోవడం
నూతనాంకురాన్ని పొదవి మమకారాన్ని కోల్పోవడం
కట్టిన కలలగూళ్ళు కుప్పకూలిపోవడం

నడుస్తున్న దారిలో ఎటో తప్పిపోయి మార్గాన్ని కోల్పోవడం

నీడనిచ్చినచెట్టు వేళ్ళతో కూలి పోవడం

ఒకేబెంచీపై నేర్చిన అక్షరాలు విద్వేషమై దోస్తీని కోల్పోవడం

 చెమటోడ్చి, కడుపుకట్టి దాచుకున్నది
సొంతమనుకున్నది హఠాత్తుగా కోల్పోవడం  

* * *

కోల్పోవడం ఆశల్ని కత్తిరిస్తుంది
పూడ్చలేని ఖాళీని నింపుతుంది

నిరాశనిండిన కన్ను
చెరువుఅలలపై తేలియాడుతుంది

....................................8.9.2013 22:25 hrs ISD

Monday, 2 September 2013

జీవన గమనం


ఉదయమైనట్లు అలారంచెప్పింది
వడివడిగా పలకరింపుల ఎస్ఎంస్సులు
అల్పాహారా సమయం
చానళ్ళలోనో, ఆన్‌లైన్‌లోనో కొన్నివార్తలు కళ్ళముందు స్క్రోరింగులు

ఇరుక్కుపోయే రహదారుల్లోకి నా కారునడపాలిక
అర్జెంటయితే ఓ మిస్స్‌కాల్ చెయ్యి
నీతో పనివుంది ఆఫీసుకెళ్ళగానే ఆన్‌లైన్లోకి రా!

రూపాయి పతనాలు
రాజకీయ ధర్నాలు
నమ్మించి మోసంచేసే పధకాలు ...వాటంతటవే జరిగిపోతాయి!

ఇప్పుడు సమయంలేదు
రావాలంటే ఎన్ని ఆంక్షలో, ఎంతకర్చో తెలుసా నీకు
బాల్యం అందమయినదే
అదే తలపోస్తూ దాటివచ్చిన ఖండాంతరాలలో మనలేను!

మీటింగులు, అప్పాయింట్‌మెంట్సుతో
డైరీ ఎప్పుడో నిండిపోయింది.

ఆన్‌లైన్‌లో ఆకుపచ్చగా కన్పించినంతమాత్రాన
నీతో నాల్గక్షరాలు చాట్ చెయ్యలేను
అంతకంటే అవరమైన వారితో సంబాషణలో వున్నాను
అది నీకు తెలియాల్సిన అవసరంలేదు
నా పనులు నాకున్నాయి

నువ్వు ఎలావుంటే నాకేంటి?
నీవుపెట్టే స్టేటస్సుకు ఏదొక సమయంలో లైకు పెడ్తాలే!

..................................................1.9.2013,  06.55 hours. ISD