~*~
చెట్టున పండిన ఆకులు రాలినట్టు
రాలిపోతున్న ఆనవాళ్ళకు
ఒంటరి కొమ్మ
సాక్ష్యంగా నిలబడి ఉండటం కష్టమే కావచ్చు
**
ఒకొక్కటిగా
చితాబస్మమౌతున్న జ్ఞాపకాలు
సమాధులకు పుష్పగుచ్చాలు
కాసింత అనుబంధంతో హృదయాన్ని మెలిపెడుతుంటాయి
చూస్తున్న కళ్ళకు
రహదారిపై నడుస్తూ నడస్తూ
మలుపుతిరిగి కనబడనట్టు
దృశ్యాదృశ్యాల మధ్య మనసు చిక్కుకుంటుంది
**
కొన్ని
పాదముద్రలను వదిలేయడం
కొన్ని పాదముద్రలను వెదుక్కోవడం
అనివార్య నిరంతర పరిభ్రమణం
భావోద్రేకాలలో
పొంగే నదులు ఎండిన ఎడారులతో
జోలెనింపుకోవడం తప్పనిసరి
**
నాల్గక్షరాలను నదుల్లోముంచి
ఆరబెట్టినప్పుడు
ఎవరో ఒకరు జలధార పాయలను వెదుక్కోక మానరు
**
నా నుంచి కనుమరుగైన మిత్రుడా!
పదిలపరుచుకున్న
నీ అక్షరం,నీ పాదముద్రలకు నమస్కరిస్తాను
**
మిత్రులారా!
ఎన్నడైనా రహదారిలో నేను కనుమరుగైతే
సమాధులలో వెదక్కండి
అక్కడుంచేపూలు జ్ఞాపకాన్ని రగిలించేందుకేనని గుర్తుంచుకోండి
ఎప్పుడైనా నాతో కలిసివున్న
చిత్రంలో వెదకండి ఒక్క జ్ఞాపకమైనా దొరుకుతుంది.
-----16.10.2014 12:50 గంటలు (ఇండియా సమయం)
No comments:
Post a Comment