Saturday 11 August, 2007

అమ్మ మమ్మీ

పదుగురాడు మాట
పదమై చెల్లును ధరణిలోన
బస్సు, రోడ్డు, సైకిలు, రైలుబండి ... ఇలా మమ్మీ అయినా

త్రేతాయుగపు రావణుణ్ణి
ద్వాపరయుగంలో కూలిన
నరకాసురినికి ప్రతీకచేసి
కలియుగంలో కాష్టం కాలుస్తూ
మూడు యుగాలకు ముచ్చటగా
ముడివేసుకుంటూ
నూతనత్వం ఆపాదిస్తున్నప్పుడు
మమ్మీ జనపథంలో మన పదం కాదా?

ప్రసవంనాటి నుంచే మొదలయ్యే
లాభనష్టాల బాలారిష్టాల మద్య
ఓ సారి పిల్లలవైపు
మరోసారి పెద్దలవైపు వూగిసలాడుతూ
క్షణాలకోసం కణాలతో పరిశ్రమిస్తూ
స్తన్యాన్ని దైన్యగా ఘనీభవింపచేస్తూ
అనురాగానికి టైం టేబులు వేసినప్పుడే
అమ్మ డమ్మీగా మారితే
ఆ డమ్మీని మమ్మియని పిలిస్తేయేం?

*****

అట్లతద్దంటూ
కొమ్మకొమ్మకో వూయలేసి వూగిన
కిల కిల నవ్వుల కేరింతలేవి?

నూతనత్వపు నాందిగా
ఇంటింటా పాతబడ్డ సామాను
బోగినాడు బూడిదౌతుంటే
చతురోక్తుల చలికాసుకున్న ఆహ్లదమేది??

కనుమనాడు
వురంత పొలిమేరకు
రథాలను లాగిన గురుతులేవి???

నరాత్రుల సంబరాలు
అంబరాన్నితాకే పద్యగానాల
మర్మోగిన 'హర్మో'నియం జాడలేవి?

పదాలను జీవన రాదారుల్లో మరిచేస్తూ
మమతలకు కరువొస్తున్న కాల నేపద్యంలో
అమ్మని పిలిస్తేయేం? మమ్మీ అయితేనేం?

బ్రతుకు నావకు డాలరు తెరచాపెత్తి
వాలుకు వదేలేసిన జీవితాలు
ఎవరు సారంగి? ఏది చుక్కాని?

అల్పపీదనం నోటుపై కేంద్రీకృతమై
రేగుతున్న తుఫాను జాడలమద్య
కొత్త తీరాలాలో లంగరేస్తున్న నావలు
మూలాలను మర్చిపోతున్న జాడలు

చిగురులేదని శిశిరాన్ని నిందించకు
శిశిరంలో దాగిన చిగురు వసంతాన్ని చూడు
శుష్కించిపోతున్న నాడీ మండలానికి
ఏదైనా శస్త్రచికిత్సచెయ్యి
తెరచాపను దించెయ్యి
తెడ్డుపట్టుకో వాలుకెదురైనా

నేస్తమా!
అప్పుడది తెగులుకాదు
తెలుగు వెలుగు
వెలుగు తెలుగు.


__________

కవితా మాలిక 2005

No comments: