Wednesday, 31 August 2011

కవిత్వాలాపన - నా కవిత్వం


బాల్యంలో
బడిలోనో, అరుగుపైనో
అక్షరాలు దిద్దినప్పటి నేస్తం
పట్టిసీమ శివరాత్రి తిరునాళ్ళలో
తప్పిపోయిన 'బిక్కి' బక్కపిల్ల …. నా కవిత్వం

చలిరాత్రుల్లో
గువ్వపిల్లలా ముడుచుకొని
వెచ్చదనపు మంగవడిలో
రాకుమారుల సాహసాలకు
ఊకొట్టిన కథల సవ్వడి …. నా కవిత్వం

వెలుగుల్లేని వాడల్లోకి
కాలినడకన గడప గడపను దర్శించి
మండే చితుకుల వెలుగుల్లో
అక్షరాలను, వాక్యాలను
వెదజల్లిన బోధకురాలు
రత్నమ్మ బైబిలుసంచి …. నా కవిత్వం

నవరాత్రుల సంబరాల్లో
పల్లెగుండెల్లో తడిపొడి చిందుల్లో
ఉర్రూతల కేరింతల చిందేయించిన
వీరాస్వామి డప్పు వాద్య
చిర్రా చిటికిన పుల్లా …. నా కవిత్వం

సుబ్రమన్యుని తిరునాళ్ళలో
గమ్మత్తైన లాజిక్కుతో
ఒకటికి మూడంటూ బొమ్మలజూదం
కనికట్టో మేజిక్కో
పాములనో మనుషులనో ఆడించి
విసిరే మంత్రించిన తాయత్తు …. నా కవిత్వం

అక్కకోరిన కోర్కె
తీర్చలేనిది కాదంటూ
కుక్కలున్న వీధినిదాటి
ఎండవేళను మరచి
స్కూలు వెనకున్న ముళ్ళపొదొంచి
కోసుకొచ్చిన గొబ్బిపూలు …. నా కవిత్వం

గట్టు డొంకల్లోని కాకరకాయలు
కొండ దిగువలో వాక్కాయలు
చింతతోపుల్లో చింతకాయలు
తూముల కెదురెక్కిన చేపలు
చిటారు కొమ్మనో
తూము ప్రవాహాన్నో
వడిసిపట్టుకున్న గుప్పిట వేళ్ళు …. నా కవిత్వం

ఆజానుబాహుడు
వాచక నటనావైదుష్యంతో
సహజకవచకుండలాల కర్ణుణ్ణి
అవలోకగా సాక్షాత్కరింపచేసిన
క్రిష్ణమూర్తి(జడ్జి) కొట్టిన చప్పట్లధ్వని …. నా కవిత్వం

కొవ్వూరు పశివేదల మద్య
నిరంతర సమాంతర రేఖాపట్టాలను కలుపుతున్న
కొంగలబాడవ వంతెన
రైల్వేకమ్మీ భుజాలు దాటిన లేతపాదాలు ...నా కవిత్వం

ఎదుగుతున్న బాల్యంనుంచి
ఆటవిడుపుల చెలిమిరెక్కలు విప్పుకుంటూ
ఆడుకున్న ఏడుపెంకులాట బంతి ... నా కవిత్వం

సంవత్సరాంతర పరీక్షలకోసం
క్వార్టర్ నంబరు ఐదు వాకిట్లో
పెద్దలాంతరో, పెట్రోమాక్సు లైటో వెదజల్లే కాంతికి
చేరిన పిల్లల చదువుల కోలాహలం ... నా కవిత్వం

పెరటిలోచి సర్రున పాకి
వీధిలోకి తొంగిచూసి
బావి అంచు పగుళ్ళలో దాక్కొని
నీళ్ళకొచ్చినవారిని భయపెట్తిన తాచును
ఒక్కవుదుటన చంపి భయాన్నితీర్చిన క్షణాలు ... కవిత్వం

హైస్కూల్లో ఎదుగుతున్న పడచుల
ప్రేమలేఖల పరిమళాలు
పుట్బాలు కబడ్డీలు వాలీబాలు
పోటీలతో సీనియర్స్
స్పూర్తినిచ్చే చెమటచుక్కలు ... నా కవిత్వం

గోదారి ఈతలు
అలల గలగలలు
జలరివలలు
ఇసుకతెన్నెల పరుగులు కుస్తీలు
నిర్ణీత సమయ సంకేతాల ప్రేమజంటలు
వేళను గోధూళి చేసే పశువులు
చూస్తూ చూస్తూనే జారిపోతున్న పొద్దులో
భాను థియేటరునుంచి వినిపించిన
ప్రార్థనా గీతపు గ్రాంఫోను రికార్డు ... నా కవిత్వం

2 comments:

కనకాంబరం said...

బాల్యపు జ్ఞాపకాలు నాడవి కఠిన మైనవనిపించినా నేటికవి తీయని జ్ఞాపకాలే, మధుర స్మృతులే .ఆ జ్ఞాపకాల అడుగుల సవ్వడు లే .... కవితో ద్భవమై ...., అద్భుతం జాన్ సాబ్. Nutakki Raghavendra Rao (Kanakambaram)

కెక్యూబ్ వర్మ said...

మీ హృదయం ఐమూలల దాగిన జ్నాపకాల దొంతరలనే కవిత్వంగా మాకందరికీ పరిచయం చేస్తూ మీ బాల్యం చుట్టూ పరుగులెత్తించిన ఈ కవితా ఝరికి అభినందనలు సార్...