రెండు గదుల్లోకి
జీవితాన్ని సర్దుకున్నప్పుడే
సగం స్వేచ్చకు సంకేళ్ళు వేయబడ్డాయి
అప్పుడప్పుడూ
అతిథులై పలుకరించే అవసరాలలో
మౌనంగా ముడుచుకుంటుంది
అటూ ఇటూ తిరిగే పిల్లలమధ్య
కళ్ళుతెరిచేలోగా
తృప్తి అసంతృప్తుల మధ్య
తెల్లవెంట్రుకలేవో పొడుచుకొస్తాయి
గొంతులో అల్లలాడిన పలుకులు
గుటకలై మిగిలిన స్వేచ్చ
జ్ఞాపకాలుగా
వంటగదిలో వేళ్ళాడే చిత్రపటాలౌతాయి
అలుపెరుగని దేహం
వోవర్ హాలింగు కోరుకుంటుంది
కుంటుతున్న ఆర్థిక ద్వారం
తుప్పట్టిన మడతబందుల మధ్య యిరుక్కొని
తెరుచుకోనంటుంది
శిశిరం అకాలంగా ముసిరితే
రాలుతున్న ఆకుల్లోచి తెగిపడ్డ స్వేచ్చ
తన సంకెళ్ళను తానే విప్పుకొని
మరో రెండుగదుల జీవితాన్ని వెదుక్కుంటుంది.
2 comments:
wow..మొదటి నాలుగూ పారాలూ నచ్చాయి.
manchi kavitha.
Post a Comment