Monday, 4 June 2012

ఇక్కడ నది ప్రవహించేది

తెలుగులో బ్లాగులు మొదలయ్యిన తొలినాళ్ళలో  స్నేహమా అనేబ్లాగు అందరినీ మైమరిపించింది
ఈ మధ్య ఎందుకో స్తబ్దమై పోయింది
జ్ఞాపకాలను ప్రోదిచేసుకుంటూ
మళ్ళీ రాధిక గారి రచనలు ప్రవాహమై అందర్నీ తాకలనీ బ్లాగ్ముఖంగా  అభ్యర్థిస్తున్నాను   
 * * * * * *

ఇక్కడ నది ప్రవహించేది
ప్రవహిస్తున్న చోటుల్లో పచ్చదనాన్ని నింపింది
స్నేహమందించిన ప్రవాహం
కూడలిలో సంగమమయ్యేది

పరిమళాల పూలు గుత్తులు గుత్తులుగా వికసించేవి
పరిమళాల్ని వెదక్కుంటూ
ఎన్ని రంగుల తుమ్మెదలు సీతాకోక చిలుకలు
తమరెక్కల్ని ఆడించేవి

ఎందుకో ప్రవహిస్తున్న నది
హఠాత్తుగా  ప్రవాహాన్ని కోల్పోయింది

అప్పగింతలయ్యాక
ఏ పండగకో, పబ్బానికో అథిదిగా వచ్చే ఆడపడచుగానైనా
కన్పించడం లేదు!
ఆంక్షల డాములు తనువంతా కట్టిపడేస్తున్నట్టున్నాయి

బహుశ
నది ఎవ్వరికీ చెప్పకుండా
తన ప్రవాహ దిశను మార్చుకుందేమో!
పరీవాహంలో
పచ్చదనం శాస్వతమని బ్రమసి
ఏర్పడ్డ ఆవాసాలు కళను కోల్పోతున్నాయి
పచ్చదనాల మధ్య
పిట్టలు, వలస పక్షుల పలకరింపులు
కానరాకున్నాయి

నది ఎటైనా వలసపోయిందా?
వలస పోవటం నదికి సాధ్యమా?

బహుశ
సెలయేర్లకు
పారుతున్నవేళ ఒరుసుకున్న నడకల మెళకువలు
నేర్పుతూ నేర్పుతూ
నడకే మర్చి పోయిందా?


నదిలో
స్నాన మాడి దేహమలినాన్ని కడుక్కున్న వారు
దోసిళ్ళతో నీళ్ళు తాగిన వారు
కడవలతో, కావడితో  మోసుకెళ్ళిన వారు
మిలమిల మెరిసిన వెండివెన్నెలలో ఈదులాడిన వారు
ఉనికి ఇచ్చే వూతంకోసం
ప్రవాహంకోసం వెర్రిగా ఎదురుచూస్తున్నారు


ఊరిరందరికీ గొంతు తడిపి
ప్రవాహబంధాన్ని కోల్పోయిన
ఊటబావి జ్ఞాపకంగా మిగిలిపోయింది

వెలుగు కన్నులతో
నీ చుట్టూ బ్రమింపచ్వ్సుకుంటున్న
రవీ.. కవీ...
ఎక్కడైనా తారసపడితే
ఎదురుచూసే మా కళ్ళవాపులను చెప్పవా?

నీవు విహరిస్తున్నప్పుడు
మా దీనావస్థను గమనించి
మేఘమా... నీలిమేఘమా..
చిలకరింపుల పులకరింపుల జల్లులై
నదీ తనువును తడిపిపో !!!


ఎదురుచూపుల దేహాల్నీ
ప్రవాహాల మాటున తడిపిపొమ్మని
మా మాటగా ఎవరైనా సందేశాన్ని
నదికి చెబుతారా??
   ----------------

3 comments:

భాస్కర్ కె said...

chaalaa bhaaga undandi.
radhika garu malli raayaalani aasisthu.

oddula ravisekhar said...

బహుశ
సెలయేర్లకు
పారుతున్నవేళ ఒరుసుకున్న నడకల మెళకువలు
నేర్పుతూ నేర్పుతూ
నడకే మర్చి పోయిందా?


నదిలో
స్నాన మాడి దేహమలినాన్ని కడుక్కున్న వారు
దోసిళ్ళతో నీళ్ళు తాగిన వారు
కడవలతో, కావడితో మోసుకెళ్ళిన వారు
మిలమిల మెరిసిన వెండివెన్నెలలో ఈదులాడిన వారు
ఆగిపోయిన బ్లాగును నదితో పోల్చి మీరు వ్రాసిన కవిత చాలా వాటికి వర్తిస్తుంది.అద్భుతమైన మీ కవితా గమనం చాలా బాగుంది.మీ కవిత చదివి మీరు కోరుకున్న బ్లాగు ప్రారంభం కావాలని మా కోరిక

Anonymous said...

అందమైన వ్యక్తీకరణ