చాలా సంవత్సరాల తర్వాత
ఖైరతాబాద్ వెళ్లాను
కొన్నివీధులు నడుచుకుంటూ తిరిగాను
కళ్ళముందు దాటుకుంతూ వెళ్లిపోయిన
సంవత్సరాల దొంతరను వెదకాలని ప్రయత్నం
యవ్వన రోజులను తనలో దాచుకున్న
శ్యాం, రీగల్ సినిమాలు
శిథిల జ్ఞాపకంగా మిగిలాయి
ఇక్కడే
నా జీవన పోరాటాన్ని
ప్రారంభించడానికి
ప్రింటింగుప్రెస్సులు ఆసరానిచ్చాయి
అవి ఇప్పుడులేకపోవచ్చు
ఆ అనవాళ్ళింకా మిగిలేవున్నాయి
భవనాలు, షాపులు రూపు మార్చుకున్నాయి
బహుశ
యజమానులు మారివుండొచ్చు
వ్యాపారాలేవి మారలేదు
అదే రైల్వేగేటు.
కూరగాయలు, కుండలు, కట్టెలు, మద్యం
ప్రతిసంవత్సరం
ప్రపంచచూపును తనపైకి త్రిప్పుకొనే
గణేషుని పెట్టే చోటు అలాగేవున్నాయి
నన్ను పలకరించేవారు ఎవరూ లేకపోవచ్చు
ఇక్కడెక్కడో శివారెడ్డి తిరిగేవాడట
నల్లగేటుండేదని నందివర్దనం పూసేదని శిఖామణి చెబుతాడు
ఏదీ కనబడదు
అయినా
జ్ఞాపకం నడకే కదా!
అనుభవం నాదే కదా
December 24, 2011
1 comment:
chikkani jnapakam
Post a Comment