Monday 1 April, 2013

జీవితమంటే



జీవితమంటే
సుడిగాలి పర్యటనేమీ కాదు

దాచుకున్న కన్నీటి అలలపై
వ్యధాగత పడవల్ని వదిలెయ్యాలి

సంతోషాలను ఆనందంగా
సంచుల్లో నింపుకోవాలనుకుంటాం
దుఃఖపు ఛాయల్ని వేరుచేయాలనుకుంటాం
నాణెంపై బొమ్మాబొరుసులా
చలామణిచేస్తూనేవుంటుంది

జీవనగీతిలో
ఎప్పుడూ ఒక్క రాగమే ఆలపిస్తే ఎలా!
సంగీత ఝరులలో ఓలలాడాలిగా!

తొలిసారి అక్షరాల్ని గుర్తించిన కన్ను
ఎన్నిసార్లయినా అలానేగుర్తిస్తుంది
గుణింతాలను అద్ది
అక్షరాలమధ్య దేన్నో దాచాలనుకుంటాం

రాగబంధాలతడిలో
అక్షరాలను నానబెట్టాలనుకుంటాం

ఎక్కడ్నించి పుట్టుకొస్తాయి జ్ఞాపకాలు
నడచివచ్చిన నాల్గు అడుగుల్లో
ఎక్కడొకచోట
గుక్కెడు నీళ్ళతో గొంతు తడుపుకుంటేనేగా!

నడచిన దారులే ఎరుకలౌతాయి
చదివిన అక్షరాలే
తోరణాలై ఆలోచనలను ఆహ్వానిస్తాయి

ఏ సమయంలో
ఎక్కడ ఎవర్ని కౌగిలించుకున్నావో!
బహుశ
నిదురించిన సమయమే ఎక్కువ
అలసటచెందిన కణం
నిద్రిస్తున్నప్పుడు కొత్త శక్తినేదో నింపుకుంటుంది

నడుస్తూ న్సడుస్తూ
నిదురించడం ఎప్పుడైనా గమనించావా
రెప్పల్నిమూసి ఆలోచనల్ని ఆపి
పరిసరాలతో పనిలేదన్నట్టు
తన్ను తాను మరచే దేహంలా
ఎక్కడో దొర్లడం గమనించావా!

11.9.2012 between 2.30 and 4.00 am

1 comment:

Mangu Siva Ram Prasad said...

భావ చిత్రాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి అక్షరమాలతో జీవితాన్ని అలంకరించారు. జ్ఞాపకాల పేటికలను అరలను తరచి చూపారు. కవితను ఒక అధ్బుతమైన అనుభూతిగా అంధించారు. ధన్యవాదాలు