Saturday, 27 April 2013

తెల్లవారు జామున


బల్లముందుకూర్చొని 
రాత్రి రాలిన మంచు బిందువుల్ని ఏరుతుంటాను 
పక్షులు విదిల్చే కువకువల్ని వింటూనే
అనంత నముద్రాలపై పయనిస్తుంటాను 
ఎవరిదో రాత్రి తడిసిన దిండు
పించమై పురివిప్పిన అక్షరాల మధ్య 
రంగులు వెదకుతుంటాను

కూజాలోంచి వంపుకున్న నీళ్ళు 
గొంతులో చల్లగా జారుతూ
ఎప్పుడో తడిసిన వెన్నెలవానను జ్ఞప్తికి తెస్తుంది
అక్కడో వృద్దుడు
తంత్రులను సరిచెయ్యాలని ఆత్రపడతాడు
తిరిగొచ్చేవారికోసం
కొత్త రాగాన్ని శృతిచేస్తుంటాడు
నింపడానికి నాదగ్గరేసంచీ వుండదు

నా కోసం తీసుకొచ్చిన 
పలుకులేమనా వున్నాయా యని
వెదకుతుంటాను 
ఎట్నుంచే ఎగిరిపడ్డ నెమలీకొకటి 
నన్నుపట్టి వివశుణ్ణి చేస్తుంది 
ఒక చిర్నవ్వు 
మనసుకో ముఖానికో
పులుముకున్నాననుకొనేలోగా 
విద్యుత్తు దారితప్పుతుంది.

తెరచుకున్న గుమ్మంముందు 
ప్యాకెట్టులో ఒదిగిన పాలు
పలకరిస్తాయి 
ఇక శబ్దం ఒకొక్కటిగా లోనికి చేరుతుంది.
పరుగులన్నీ తొందరచేస్తాయి
* * *
అలుపు, నిద్రలను దులుపి
మళ్ళీ 
బల్లముందు కూర్చునే వరకు 
ఏదీ గుర్తుండదు.


***
తెల్లవారు జామున బల్లముందుకూర్చొని రాత్రి రాలిన మంచు
బిందువుల్ని ఏరుతుంటాను. పక్షులు విదిల్చే కువకువల్ని వింటూనే
అనంత నముద్రాలపై పయనిస్తుంటాను. ఎవరిదో రాత్రి తడిసిన దిండు,
పించమై పురివిప్పిన అక్షరాల మధ్య రంగులు వెదకుతుంటాను


**8717

No comments: