Saturday, 13 July 2013

రాత్రంతా వర్షం కురుస్తోంది



వేకువనే తనువంతా అరగదీస్తూ
వాకిలిని ఊడ్చిన చీపురును
ఎవరు పలకరిస్తారిప్పుడు
ఏదోమూల అలా స్తబ్దుగావుంది

బురదనిండిన వాకిలిని చూసావా
పాదానికి అంటకుండా
అక్కడక్కడా వేసిన రాళ్ళపైనుండి
అంగలువేస్తూ నడవడం గమనించావా!

పొటమరించిన అంకురాలతో
నునులేతపచ్చరంగు అలుముకొని
శింగారించుకుని
నారుమడులు, నాట్ల మధ్య
ఆరేసిన పొలాల కలనేత ఊరు

బురదవీధుల్లో నడిచెళ్ళిన పశువులమధ్య
గిట్టలగుర్తులతో
ఆవేదో, గేదేదో, ఎద్దేదో
ఎటుగా వెళ్లిందో పసిగట్టడం నేర్చావా!

పశువులను తోసుకుంటూ
నీరునిండిన గుంతలను దాటుతూ
సన్నగా కురిసే చినుకులకు
పలక నెత్తినపెట్టి పరుగెట్టి
బడి గిలకబావిని
చేదుకున్న నీళ్ళో
కడుకున్న కాళ్ళో గమనించావా!

ఈ రాత్రంతా వర్షం కురియాలి

గుమ్మపాల నురగలతో
స్వచ్చతనేదోవెతుక్కుంటూ
వాకిట నిలబడి
నీకోసం పడవలను వదులుతాను!

6 comments:

తెలుగమ్మాయి said...

చాలా బాగుందండి మీ కవితా వానజల్లులో తడవడం

Padmarpita said...

అసాంతం మనసుని ఆకట్టుకునేలా అందంగా వ్రాసారండి.

భాస్కర్ కె said...

కవిత చాలా బాగుందండి,.అభినందనలు,

జాన్‌హైడ్ కనుమూరి said...

తెలుగమ్మాయి gaaru
Thank you

జాన్‌హైడ్ కనుమూరి said...

Padma Arpita
నేను రాయలేదండి. రాత్రంతా కురిసిన వర్షం నాచేత రాయించింది

జాన్‌హైడ్ కనుమూరి said...

the tree gaaru

thank you