Wednesday 1 October, 2014

ఇంతదూరం నడిచొచ్చాక - 5

~*~
పుస్తకాల అరను సర్దుతూ
నలిగి అట్టచిరిగిన పుస్తకమొకటి చేతిని తాకుతుంది
కళ్ళలోకి ప్రసరించిన జ్ఞాపకంతో మూర్చపోతాను
అక్షరాలను పద్యాలుగా పేర్చిన చోటుకు లాక్కెళుతుంది
~*~
ముడిపడ్డ కొన్ని ఆలోచనలు
పేజీల్లోంచి లేచివస్తాయి
~*~
ప్రేమించడం నేర్చిన సమయాలు
దూదిపింజం ఎగురుతున్నట్టు చిత్రాలు
పాటలు, పద్యాలు, కవిత్వాలు
లైబ్రరీలో దాక్కున్న వాక్యాలు
పొన్నగపూలు రాలినట్టు ఓ తెల్లని పరిమళం
~*~
గోడమీద రాసిన అక్షరమొకటి వెన్నంటి
నిన్నూ నన్నూ కలిపింది
ఎన్ని గంటలు మనమధ్య చర్చానెగడును రేపిందో
ఆయుధంగా భుజాన వేసుకుని ఎటో వెళ్ళిపోయావు
కాలేజీ గేటు దాటి
రద్దీ రోడ్డులో కలిసిపోయాను నేను
~*~
ఇంతదూరం వచ్చాక
ఎవరెక్కడని అడగొద్దు
జవాబులేని ప్రశ్నగా మిగిలిపోతుంది. 

No comments: