Thursday, 30 August 2007

కంచుకంఠం ముక్కలైయ్యింది


చిత్రం! విచిత్రం జరిగింది

ఎన్నోరాగాలొలికిన

ఓ హార్మోనియం పెట్టె మూగబోయింది

మనసుపొర అడ్డంగా చిరిగింది

దేహాన్ని చీల్చుకొని

గీతకారుని లోకానికి పయనమైపోయింది

రణగొణల మధ్యనుండి

నిశ్శబ్దాన్నవహించిన దేహం!

పిల్లగాలి అలలు అలలుగా

బాధాతప్త హృదయాల పల్లకినెక్కి సాగిపోయింది

ఫిల్ము రీళ్ళుగా మార్మోగిన కంఠధ్వని

ఝణ ఝణ మనిన అక్షరధుని

గోర్వెచ్చని స్పర్శగా

ఎందరినో స్పృశిస్తూ ఎగిరిపోయింది

సమ్మోహితులను చేసిన ఆకాశవాణిలా ఆ కంఠం

కట్టబ్రహ్మన్ ఆవేశశౌర్యాలతో వుత్తేజింపచేసిన ఆ కంఠం

కనురెప్పల జ్ఞాపకాల రీళ్ళలో

లూధర్ ఫర్డ్ ను మరిపించిన ఆ కంఠం

ఎన్నో మహోన్నత వ్యక్తీకరణల సజీవశిల్పం ఆ కంఠం

ఏ తలపుల తలుపుల్ని తట్టినా

పుస్తకాల దొంతరల సాహిత్యలోకంలో వెదికినా

ఏదో ఒక కూడాలిలో వెలిగే దీపస్థంబంగా

మార్మోగుతూనే వుంటుంది ఆ కంఠం

(శ్రీ కొంగర జగ్గయ్య స్మృతిలో )

Friday, 24 August 2007

అంకురాల ఎదురుచూపు

నిన్ను కలిసిందీ లేదు
నీతో మాట్లాడిందీ లేదు
పరిచయాల జ్ఞపకాలేవీ లేవు
ఎన్నో ఏండ్ల నిరీక్షణను
పూలదారంలా అల్లి మోసుకొచ్చి
కుదురులా అక్షరానికి చుట్టి
ఎదకు గురిపెట్టి పోయావు
అక్షరగురి నన్ను చుట్టి
నీకాలపు కొలమానంలోకి లాక్కెళుతున్నాయి
నాకాలంలో నిలుపుతున్నాయి
నాకేందుకు కలవలేదు?
అయినా...
డిజిటల్ డిజిటల్ సింఫనీలను
నీ అక్షరంలో వదిలిపోయావు
స్వరించని నా కంఠంలో
కీబోర్డును స్పర్సించలేని నావేలికొనల్లో
ఏదో విద్యుత్ ప్రవాహం
ఇది కొత్త రాగానికి నాందోయి
ఆశలవిత్తనాలకు పొడుచుకొస్తున్న అంకురమోయి
నేస్తం మళ్ళీ రా!
ఎన్నో విత్తనాలు పడివున్నయి
అంకురాలకోసం

జనారణ్యాన్ని ఛేదించుకుంటూ
మైదానాలను విభేదించుకుంటూ రా!

ఎర్రని సూర్యున్ని పుచ్చకాయలా కోస్తా
గొంతు చల్లబరుచుకుందాం

వెలుగురేఖల్ని గుత్తులుగా కోసుకొస్తా
తురుముకుందాం

మరోపూలవనాన్ని స్వప్నిద్దాం

ఏ సాతాను చొరబడని
ఏదేను వనాన్ని పెంచుదాం

(శ్రీ మద్దూరి నాగేష్ బాబు స్మరణలో )

Saturday, 11 August 2007

అమ్మ మమ్మీ

పదుగురాడు మాట
పదమై చెల్లును ధరణిలోన
బస్సు, రోడ్డు, సైకిలు, రైలుబండి ... ఇలా మమ్మీ అయినా

త్రేతాయుగపు రావణుణ్ణి
ద్వాపరయుగంలో కూలిన
నరకాసురినికి ప్రతీకచేసి
కలియుగంలో కాష్టం కాలుస్తూ
మూడు యుగాలకు ముచ్చటగా
ముడివేసుకుంటూ
నూతనత్వం ఆపాదిస్తున్నప్పుడు
మమ్మీ జనపథంలో మన పదం కాదా?

ప్రసవంనాటి నుంచే మొదలయ్యే
లాభనష్టాల బాలారిష్టాల మద్య
ఓ సారి పిల్లలవైపు
మరోసారి పెద్దలవైపు వూగిసలాడుతూ
క్షణాలకోసం కణాలతో పరిశ్రమిస్తూ
స్తన్యాన్ని దైన్యగా ఘనీభవింపచేస్తూ
అనురాగానికి టైం టేబులు వేసినప్పుడే
అమ్మ డమ్మీగా మారితే
ఆ డమ్మీని మమ్మియని పిలిస్తేయేం?

*****

అట్లతద్దంటూ
కొమ్మకొమ్మకో వూయలేసి వూగిన
కిల కిల నవ్వుల కేరింతలేవి?

నూతనత్వపు నాందిగా
ఇంటింటా పాతబడ్డ సామాను
బోగినాడు బూడిదౌతుంటే
చతురోక్తుల చలికాసుకున్న ఆహ్లదమేది??

కనుమనాడు
వురంత పొలిమేరకు
రథాలను లాగిన గురుతులేవి???

నరాత్రుల సంబరాలు
అంబరాన్నితాకే పద్యగానాల
మర్మోగిన 'హర్మో'నియం జాడలేవి?

పదాలను జీవన రాదారుల్లో మరిచేస్తూ
మమతలకు కరువొస్తున్న కాల నేపద్యంలో
అమ్మని పిలిస్తేయేం? మమ్మీ అయితేనేం?

బ్రతుకు నావకు డాలరు తెరచాపెత్తి
వాలుకు వదేలేసిన జీవితాలు
ఎవరు సారంగి? ఏది చుక్కాని?

అల్పపీదనం నోటుపై కేంద్రీకృతమై
రేగుతున్న తుఫాను జాడలమద్య
కొత్త తీరాలాలో లంగరేస్తున్న నావలు
మూలాలను మర్చిపోతున్న జాడలు

చిగురులేదని శిశిరాన్ని నిందించకు
శిశిరంలో దాగిన చిగురు వసంతాన్ని చూడు
శుష్కించిపోతున్న నాడీ మండలానికి
ఏదైనా శస్త్రచికిత్సచెయ్యి
తెరచాపను దించెయ్యి
తెడ్డుపట్టుకో వాలుకెదురైనా

నేస్తమా!
అప్పుడది తెగులుకాదు
తెలుగు వెలుగు
వెలుగు తెలుగు.


__________

కవితా మాలిక 2005

వూరునుంచి మా వూరికే

ఏమున్నది
రెండుగా చీలిపోయింది
ఊరుగా కొత్తపేటగా

శిథిలమౌతున్న వాటినివదిలేసి
పరుగెట్టగల్గినవారు
మైదానాలవైపు పరుగెట్టారు

జీవితాలను అడుసుగా పిసికి
గోడల్లోనొ కప్పు వాసాల్లోనో దాచుకున్నవారు
అటకమీదుంచిన ఆనందాన్ని
ఎవరైనా దించిపెడ్తారని
ముడతలుపడ్డ కనుబొమల్నెత్తి
కాలువిరిగిన వాలుకుర్చీని సరిచేసుకుంటూ
ఎదురుచూస్తూ అక్కడుండిపోయారు

మరికొన్ని జ్ఞాపకాలు
లోగిళ్ళ మొండిగోడలమద్య
మొలిచిన జిల్లేడులో
తుమ్మకంపల్లో చిక్కుకున్నాయి

అప్పుడెప్పుడో
నగరానికి బస్సు ఎక్కుతూ చూసిన గుర్తు
ఇప్పుడవి మానులయ్యాయి

అడపాదడపా
ఎప్పుడైనా నాల్గురోజుల పథకంవేస్తే
పాయఖానలేదని
కేబుల రంగుటీవీ లేదని
గోలచేసిన కుటుంబంతో
అన్నీ ఒక్కరోజు పథకాలుగా కత్తిరించడమే

కొంచెం ఎదిగిన పిల్లలతో
పోటీ పరీక్షలతో
దేశమో విదేశమో తేల్చుకొనేసరికి
ఫోనుడబ్బాలో పడ్డ రూపాయిలా
కాలం గిర్రున తిరిగింది

జ్ఞపకాలు దాచుకోలేనివాణ్ణి
ఊరినెట్లా దాచుకోను?

ఇప్పుడక్కడ కొత్తపేటలేదు
కొత్తపేటే వూరయ్యింది

ఎక్కడ్నుంచో ఎగిరొచ్చిన పెద్దపక్షి
యాంటీనాలుగా రెక్కలుచాపి
ప్రతి ఇంట్లో దూరాలనిచూస్తోంది

ప్రపంచ సుందరాంగులంటూ
పొగిడే గొంతుతో
సన్మోహమంత్రమేదో జపిస్తుంది

పొడిపొడిగా రాలుతున్న బంధాలుగా
అపార్టుమెంటుల్ని నిర్మింపచేస్తుంది
అమ్మగొంతుక్కి ఉరివేసి
మమ్మీని బ్రతికించుకుంటూంది.

Wednesday, 8 August 2007

విరుపుల విన్యాసాలు

విరుపుల విన్యాసాలు
తుమ్మెద రెక్కల్నితొడుక్కొని
అక్షరం ఎగురుతూ
నా శిరముపై పరిబ్రమిస్తుంది

దాని ఝంకారం
సింథటిక్ మోత ఏ డిజిటల్ ట్రక్కుకూ అందక
కర్ణభేరి చెంత కరుగుతుంది... మరుగుతుంది

నే విహారినైన వేళ
భిన్న వర్ణాల రెక్కలతో
కనుపాపల్లో మెరుపులా కదలాడిన
విరుపుల విన్యాసాలు
విరబూస్తున్న పూలపై
గూడు చీల్చుకొని
రెక్కల్లో రంగులు నింపుకొని
రివ్వు రివ్వున ఎగురుతుంటే
ఉవ్విళ్ళూరిన వూహ
మకరందాన్ని గ్రోలుటకై

రెప్పలపై భారాన్ని
రెక్కలపై వేసుకొని
రమ్యమనిపించే రంగుల వనంలోకి
కష్టమైనా నిష్టూరమైనా
కలతైనా వెలితైనా
కర్తవ్యం నా రెక్కలార్చడం

అయిస్కాంతంలా ఆకర్షించే
ఐ బ్రీడ్ రంగుల మద్య
వాడిపోయే దాకా
దర్పమొలకబోసే రెక్కల దేహంలో
కీలగ్ర కేశాలు
మకరంద అధరాలు
వున్నయావో లేవో
అగ్ని పరీక్షే అంచనావేయడం

సంకోచ సంశయాల దోబూచులాటలతో
ముడుచుకున్న ముగ్దగా
విరిసీ విరబూయని తనువులో
అండాకృతినిచ్చే
భాండాగారమున్నదో ... లేదో...
అగ్ని పరీక్షే అంచనావేయడం

తోటలు బీటలువారి కుండీలగా మారి
ప్లాస్టిక్ అలంకారాలమద్య
ఎదగలేకే వొదిగే
బరువెక్కిన బొన్సాయి బ్రతుకు
స్పదిస్తుందో... లేదో...
అగ్ని పరీక్షే అంచనావేయడం

తొడిమలనుండి తొంగిచూసే విచ్చుకత్తులు
రసాలలో చేరిన వైరస్ లు
రేకుల మాటున
ఏ అసహనపు లావా రేగుతుందో
అగ్ని పరీక్షే అంచనావేయడం

అయినా...
ప్రేమరేణువులు మోసుకుంటూ
పువ్వు పువ్వును పలకరిస్తూ
కష్టమైనా నిష్టూరమైనా
కలతైనా వెలితైనా
కర్తవ్యం నా రెక్కలార్చడం
_______________

ప్రజా సాహితి 2005

Monday, 6 August 2007

ఎగరడానికి ఒక్కసారి

ఎగరడానికి ఒక్కసారి
ముడుచుకున్న రెక్కలు విప్పి
ఒక్కసారి
విస్తరించడానికి పక్షిరాజువైపో...
ఎత్తులకు ఎదిగిపో
విప్పారిన ఆనందం కోసం
నెమలివైపో... పురివిప్పి నాట్యమాడుకో

అవధులులేని
కలల అంచులుతాకి
అనుభూతులను సొంతంచేసుకో
విజయపథాలను చేరుకో...

Saturday, 4 August 2007

పాద ముద్రలు


నీవు నడచిన గమనంలో 
పాదముద్రలు లేవు
 
గీసుకున్న ఆశయాల వలయాల మధ్య
 
తోడొస్తానని వెన్నంటిన వారు
 
జీవిత పద్మవ్యూహ పోరాటంలో తడబడినా
 
నీవొక ఒంటరి అభిమన్యుడివి
 
ఆరాటపు జీవన గమనంలో
 
కరుణపై నివురుగప్పి
 
కసినంతా కళ్ళలో నింపుకొని
 
మేకపోతు గాభీర్యంతో
 
మెలిగే నీవొక ఒంటరి హిట్లర్వి
 
అంతర్గత వలయాలలో
 
ఆరబోయలేని మమతానురాగాన్ని
 
మునిపంట నొక్కిన నాడు
 
నీవొక చండశాసనుడివి
 
కంతలబొతకు అతుకులేస్తూ
 
చింకిచాపపై
 
కాళ్ళు కడుపులో ముడుచుకొన్నప్పుడు
 
నీవొక అభిమానధనుడవు
 
అయినా...
 
నీవు నడిచిన బాటలో
పాదముద్రల్లేవు.

******

గొంతెడిపోతున్న వేళ
గొంతులో పోసిన గంజినీళ్ళతో
తెప్పరిల్లిన ఓ ప్రాణి
తెరువు తెలవక రెపరెపలాడుతూ
చీకట్లో తడుముకుంటూ
ఆశాకిరణపు ఆసరానొందిన వాడు
తన జీవిత చక్రకాలంలో
తడారిన కళ్ళాతో తలచుకొన్నప్పుడు
నీవొక మహాత్ముడివి
మసున్న మహరాజువి

ఆ కళ్ళకు నీ పాదముద్రలు గుర్తే
నిశితంగా చూపు నిల్పలేక
ఆ కళ్ళు మసకబారి
తికమకపడి బ్రమపడి
అటో... ఇటో... ఎటో... తొలగిపోయి
పాదముద్రలకోసం
వెతుకుతుంటాయి

అందుకే...
నీవొదిలిన పాదముద్రల్లేవు

పాదముద్రలు లేకున్నా
రేగిన ధూళిలో ఎప్పుడో
నీ పాదం తాకిన రేణువులు
బద్రంగా దాచుకున్న పరిమళాలు
బద్దలుకొట్టి
శిధిలాలనుండి త్రవ్విన
శిలాశాసనంలా
చాటుతాయి.

ఓ వృత్తంలో

ఎవరి నైపుణ్యానికి ప్రతీకో
అదొక వృత్తపు కోట


అన్ని ద్వారాలే
ప్రహారీల్లేవు
పహారాల్లేవు
సమాజపు త్రిశంకు స్వర్గం
నిరంతర పరమాణు పరిభ్రమణం

అక్కడ...
అనుభవాలతో మలచబడి
అశ్రువులతో
అభ్యంగ స్ననమాడిన
నల్లరాతి శిల్పాలే
ఆశయాల సౌధాలను
అరచేతులతో అలికిన గురుతులే
పొదగబడిన టైల్స్ వెనుక బీటలువారిన గోడలు
ఏ గోడను గీకినా రాలేసున్నం
ఆ కాలపు సమపాళ్ళను తెలుపుతాయి।

అక్కడికి...
ఏ గ్రహణపు క్రీనీడలో
ఏ బాధ్యతల బంధాలో
ఓ ఆవేశపు తప్పటడుగో
ఈ ద్వార ముఖాన్ని చేర్చాయి

నీ కొచ్చిన
... కష్టాలన్నీ ఫుట్ బాలులే
కొన్ని గోలుకెళ్ళాయి
కొన్ని గోళీలయ్యాయి
నీపై వర్షించే జల్లులన్నీ
చేతులు మారే రూకలవల్లే
... కోటవతల వృత్తాలలో
వ్యాఘ్రముఖ గోవువు
కరుణను నింపుకున్న
క్షమతా మూర్తివి
... వలపులను నలిపేసి
పొంగిపొర్లిన లావాలో
విలువలున్న లోహాన్ని
వలువలుగా ధరించిన మూర్తివి
... బాధ్యతల భారంతో వొంగినా
వెన్నుచీపని యోద్ధవి
కాలపు కొలమానంలో
కనుపించని యొక మైలురాయివి
... వృత్తాలలో రాటుదేలిన
ధీటైన రాజ్ఞివి
కోట బురుజుపై ఎగిరేపతాకం
దిశా నిర్దేశపు గురుతు

చరిత్ర కందని లోతైన విజయం నీది
నీ విజయాల హృదయ రహస్యాల్ని
అనువదించే అనుమతిస్తావా?
______________________________________


సినీ నటి కుమారి కాంచన మరియు కొందరి జీవితాలకు గౌరవంగా అంకితం


Thursday, 2 August 2007

సమీక్ష వార్త

అలలపై కవిత్వపు కలలుకవిత్వంపై ప్రేమను పెంచుకొని, ఒక నిబద్దతతో సాగిపోతున్న కవి జాన్ హైడ్. 'హృదయాంజలి ' తో నడకను సాగించి సంవేదనల, భావముద్రల సమ్మేళనంతో భావనా శక్తిని పెంచుకుంటూ తనదైన స్వరాన్ని బలంగా వినిపించే ప్రయత్నం 'అలలపై కలలతీగ 'ను సవరిస్తున్నాడు. 71 కవితల్లో స్పందింపచేసే ప్రతి సందర్భాన్ని అక్షరీకరిస్తూ బయటి వాతావరణాన్ని హృదయంలోకి ఆహ్వానించడం కనిపిస్తోంది.
"బరువెక్కిన వక్షం
క్షీరమై పొంగేవరకు
కవితై ప్రభవించే వరకు" అని అంటున్న కవి సంవేదనలనేకాదు కవితాక్షరాలను కూడా మోయక తప్పదు. తక్కువ కాలంలోనే కవిత్వపు నుడికారాన్ని అందిపుచ్చుకున్న జాన్ హైడ్ అభినందనీయులు. .....డా. రూప్ కుమార్ డబ్బీకార్
అలలపై కలలతీగ
పేజీలు 112, వెల : 50/-
ప్రతులకు : జాన్ హైడ్ కనుమూరి
13-45, శ్రినివాస్ నగర్ కాలనీ,
రామచంద్రాపురం, హైదరాబాదు-502 ०३२
ఆంద్ర ప్రదేశ్, ఇండియా వార్త_ఆదివారం_8।4।2007

Wednesday, 1 August 2007

పౌర్ణమి పరిష్వంగం

ఏ నాటి కథో
చవితినాడు చంద్రుణ్ణి చూస్తే...
నీలాపనిందలని


నేనొక రాగిపాత్రనై
బాద్రపద చతుర్థి వెన్నెల్లో పడి
పొర్లాడిన వేళ


పాదమేదో తాకింది
అస్థిత్వం లేని నా దేహాన్ని
ఏ స్వాతి చినుకో గొంతుదిగింది
ఏ సిట్రిక్ యాసిడ్డో పడింది
కిలాన్ని కడిగి మిలమిలా మెరుపొచ్చింది
వేలికొనలేవో లీలగా ఆపాదమస్తకం తడిమాయి


అల్లావుద్దీన్ దీపంగా మారింది
కళ్ళమారబోసిన వెన్నెలయ్యింది
వెల్లువై పరిమళం విరిసింది

ఆ వెన్నెల్లో  పాదచారినై
వన్నె త్రాచునై
నెలనెలా వెన్నెల పరిష్వంగంకోసం
పాదముద్రలు వెతుక్కుంటూ... వెతుక్కుంటూ


నెలవంకను స్పృసించిన
రవి వీక్షన కిరణాలు
ఆశ్ మాన్ కొండదారిపై
వెండిలా మెరుస్తూ
కకూ నా కలానికీవారథి వెన్నెల
కలాన్ని హలంగా
బీళ్ళను గాళ్ళను దున్నుతూ
వాటంగా మోటరువేసి
నరనరాన్ని నీరు నింపుతోంది

వెదజల్లిన బీజాలు
అంకురాలుగా కంకులుగా
లయ తూగుతుంటే
హరిత పవన లాస్యం మదినంతా నిండింది.
___________


మొదటి సారి నెలానెలా వెన్నెల (వినయకచవితి 2003)నాటి నుంచి కొన్ని జ్ఞాపకాలు