ఊరించినదేదో సన్మోహనపరచి
ఆనందాన్నేదో నీవిస్తావని
రహస్య దారులవెంట నడచి నిన్నుచేరాను
నీ అడుగులకు మడుగులొత్తానో
నా పాదాలకు లేపానాలే పూసావో
ఓ గుడ్డిప్రేమతో నను బంధీనిచేసావు
నిన్ను నాలో వొంపుకున్న ప్రతిసారీ
మేఘాల పాన్పుపై పవళింపచేసావనుకున్నాను
కళ్ళుతెరిచినక్షణం
ముళ్ళనుపరిచో,బురదను పక్కేసో నన్ను ఒంటరిగా వదిలేసావు
ఈ బాధలు నాకెందుకని ఎన్నిసార్లు అనుకున్నానో!!
అయినా
మల్లెలు గుభాళించినట్టు
పెదవినంటినదేదో పదేపదే గమ్మత్తుగా నీవైపు లాగేస్తుంది
వెన్నెలను విడచి
చీకటి వెలుతురులమధ్య దోబులాచులాటలతో
పాదాక్రాంతుణ్ణిచేసావు
వినోదమైన చోటుల్లో
చన్నీటిస్నానం చక్కిలిగిలిపెట్టినట్టు స్వరగతులతో చిందేయించావు
నేను నిన్ను ప్రేమించాననుకుంటే
నన్నాక్రమించి నాట్యమాడిన నీపాదాలు
ఆరు పెగ్గులనంతరం వాంతిని పరచి పొర్లించావు
సన్మోహాలను తెంచుకోవడానికి
నరాలెంతగా విలవిలలాడయో తెలుసా!
అందుకే
నీ ప్రేమాలింగనాలకు విడాకులిచ్చేసా!!
ఎన్నిసార్లు గుర్తొచ్చావో
ఎన్నిసార్లు ఎందరితో కబురంపావో
నా కోసం ఎంత విరహ సందేశాలంపినా
ఎందుకో నిన్ను కవలేకపోతున్నా!!
***
***
ఎందుకంటే
నన్ను నేను ప్రేమిస్తున్నాను
నీ ప్రేమ అబద్దమని తెలుసుకున్నాను కాబట్టి
**12.2.2014** 17:15 ISD
2 comments:
Sorry to say like this,
that this poem brings back ur interest in drinking again.
I think this poem is reduntant and unnecessary to shared which talks about ur interest brought back in drinking.
Excuse me if u can!
Anonymous
తిరిగి వెళ్ళాలనే కోరికేమీ లేదు
పద్యం అలా ధ్వనిస్తుంటే తప్పక తిరిగి రాయడానికి ప్రయత్నిస్తాను.
Post a Comment